శ్రమ దోపిడీ కూకటి వేళ్లను
తెగ నరికిన హక్కుల ఖడ్గం
అలుపెరగని స్వేదపు ఘోషను
నినదించిన శ్రమైక వర్గం
బాధ్యతల బతుకు పోరును
రగిలించిన సమైక్య నినాదం
ఆశయాల ఆర్తి గీతమును
ఎగరేసిన అరుణ పతాకం
అడుగడుగున పిడికిలి ఎత్తి
ఆకాశాన గొంతును ఎత్తి
గడగడలాడించిన కార్మిక కత్తి
ప్రభవించిన విప్లవ శక్తి
చికాగోలో శివమెత్తిన చిత్రం
ప్రపంచాన పరిచిన విచిత్రం
చిందించిన రక్తపుటేరులు
మండించెను మహౌజ్వల పోరులు
ఆగని గొడవల రక్త తర్పణం
చాకిరీ విముక్తికి ప్రాణలర్పణం
చైతన్య బావుటా ఎగిరిన కోట
ఎనిమిది గంటల పనుల పాట
వెళ్లి విరిసిన చెమట చుక్కలు
కొత్త వెలుగులై చిమ్మిన దిక్కులు
కలుపు మొక్కలను నరికిన కొడవలి
మేడే హక్కుల సమిష్టి పిడికిలి...
జగతి శాంతి కపోతమై
ప్రగతి కాంతి పతాకమై
రెపరెపలాడిన దీప్తి కేతనం
బిరబిర ప్రవాహ స్ఫూర్తి చేతనం
జయ జయహౌ శ్రామిక విప్లవ శక్తి
జయ జయహౌ శ్రమైక పరిప్లవ యుక్తి..!
- డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327










