
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో వలంటీర్ల వ్వవస్థ సమర్ధవంతంగా పనిచేస్తోందని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో మంగళవారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక వ్వవస్థలో ఒకరిద్దరు తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం తగదన్నారు. తప్పులు చేసేవారు అన్నిరంగాల్లో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రం రెండేళ్లపాటు అభివృద్ధిలో వెనుకబడిందని ఇప్పుడే క్రమంగా వేగం పుంజుకుంటుందని చెప్పారు. నగరంలోని సమస్యలపై తాను అధ్యయనం చేస్తున్నట్టు వివరించారు. లాలాపేట, సంగడిగుంట, కూరగాయల మార్కెట్ ప్రాంతాలను సందర్శించారు. వ్యాపారులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వైసిపి నాయకులు నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.