Aug 16,2023 09:12

పుస్తకంలో ఉన్నదానిని ఉన్నది ఉన్నట్టుగా బోధించటం ఒక పద్ధతి. ఆ పాఠాల్లో ఉన్న పాత్రలను తరగతి గదిలో ఆవిష్కరించి, అందులో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా బోధించటం మరో పద్ధతి. వినటం కన్నా చేయడం ద్వారా మరింత ఎక్కువగా గుర్తు పెట్టుకోవొచ్చు అన్నది ఈ రెండో తరహా బోధనకు ప్రేరణ. అలాంటి పద్ధతితో పిల్లలకు విలక్షణ శైలిలో విద్యాబోధన చేస్తున్నారు మానుకొండ రాజేంద్రబాబు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం-2 ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు.

55

           రాజేంద్రబాబు చెప్పే ప్రతి పాఠం బొమ్మల రూపంలో ప్రత్యక్షమవుతుంది. బట్టీ విధానంలో విద్యార్థుల మనోఫలకంలో చదివింది పెద్దగా గుర్తుండదనీ, అదే పాటలు, నృత్యాలు, టీచింగ్‌, లెర్నింగ్‌ మెటీరియల్‌ సహకారంతో అభినయం, నాటికీకరణ, వర్కింగ్‌ మోడళ్ల ద్వారా బోధన చేస్తే హృద్యంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆచరణలో నిరూపించారు. పనికిరాని వస్తువులతో చక్కటి బోధనోపకరణాలు తయారు చేయించటంతో పాటుగా వాటికి సృజనాత్మకత జోడిస్తే... కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని ఆయన రుజువు చేశారు. ప్రపంచం, సమాజం, కుటుంబం, ప్రకృతి, జీవనం, జీవన వైవిధ్యం ... ఇలా ఏ అంశమైన వాటి గురించి తెలియజేసే సజీవ చిత్రం (బొమ్మలు చార్టులు, ప్లకార్డులు) ద్వారా ఆచరణాత్మకంగా పాఠాలు చెబుతున్నారు. వర్ణమాల మొదలు, ఆంగ్ల వ్యాకరణం, గణిత ప్రక్రియలు, మానవ శరీర భాగాలు, పర్యావరణం, రాజధానుల గుర్తింపు వంటి అనేక అంశాల్లో ఆయన బోధనోపకరణాలు రూపొందించారు. వాటి ద్వారా విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి సాధించేలా కృషిచేస్తున్నారు.

22


                                                                       తండ్రి రాజారావు స్ఫూర్తితో...

రాజేంద్రబాబు ఉంగుటూరులో మానుకొండ రాజారావు, రాహేలమ్మ దంపతులకు 1963 ఆగస్టు 15న జన్మించారు. ఆయన తండ్రి హైస్కూలులో సోషల్‌, ఇంగ్లీష్‌ ఉపాధ్యాయులు. బహుముఖ ప్రజ్ఞాశాలి. తండ్రి స్ఫూర్తితోనే రాజేంద్రబాబు చిత్రలేఖనం నేర్చుకున్నారు. అట్టలతో, ధర్మకోల్‌తో నమూనాలు తయారు చేయడం ప్రారంభించారు. హైస్కూలు స్థాయిలో చిత్రలేఖన పోటీల్లో పలు బహుమతులు సాధించారు. కాలేజీ చదివే రోజుల్లో లెక్చరర్‌ ఎంఎస్‌ఎన్‌ మూర్తి ప్రోత్సాహంతో జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ లలిత కళా అకాడమీ అవార్డు పొందారు. ఎంఎ, ఎంఇడి చదివిన అయన 1986లో సోషల్‌ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. తను పనిచేసిన అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖనం నేర్పడంతో పాటు వినూత్నంగా పాఠాలు బోధించారు. ప్రస్తుతం భీమవరం మండలం చిన అమిరంలో స్థిరపడ్డారు. రాయలం-2 ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

44

                                                                           పాఠ్య పుస్తకాల తయారీలో...

విద్యాబోధనలో నూతన పద్ధతులు అవలంబించటం ద్వారా రాజేంద్రప్రసాద్‌కు రాష్ట్రస్థాయిలో ఎస్‌సిఆర్‌టి, జాతీయస్థాయిలో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా గుర్తింపు లభించింది. పప్పెట్రీ కళను ఉపయోగించుకుని పిల్లలకు విద్యాబోధన చేయటం మరింత గుర్తింపు తెచ్చింది. మాడ్యూల్స్‌ తయారీ, కవర్‌ పేజీ డిజైన్‌; బోధనోపకరణాలు ఉపాధ్యాయ కరదీపికలు, చేసి చూద్దాం, సృజన పుస్తకాల తయారీలో ఆయన సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకున్నాయి. విద్యా సంబంధిత వెబ్‌సైట్లు, ఇ.ఎడ్యుకేషన్‌, ఇ.బోధన వీడియోల తయారీలోనూ ఆయన పాలు పంచుకున్నారు. ఇలాంటి కృషికి గుర్తింపుగా ఇటీవల ఆయన కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు.

44


ఆంధ్రప్రదేశ్‌ పప్పెట్రీ అకాడమీలో శిక్షణ పొందారు. 8వ తరగతి పాఠ్య పుస్తకాలపై తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, సైన్స్‌, సోషల్‌, ఉర్దూ పాఠ్య పుస్తకాల్లో ఆయన గీచిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 2021లో ఉర్దూ పాఠ్యపుస్తకాలకు చిత్రకారునిగా పనిచేశారు. రిసోర్స్‌ పర్సన్‌గా శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయులకు ఆన్లైన్‌ శిక్షణ ఇచ్చారు.
                                                                                         -  గొట్టేటి శ్రీనివాసులు,
                                                                                             93971 39966

 

55

                                                               కాళ్ళమండలం బొమ్మల వల్ల పిల్లల్లో ఆసక్తి

విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి విద్యార్థుల చేత చిత్రలేఖనం, పుస్తక పఠనం, పుస్తక సమీక్షలు చేయిస్తున్నాం. సీతాకోకచిలుక ఆకారంలో లైబ్రరీ బుక్స్‌ని ఏర్పాటు చేశాం. ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, పుస్తక ప్రదర్శన నిర్వహించాం. టిఎల్‌ఎం కార్నర్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షణీయమైన బోధనోపకరణాలు ఏర్పాటు చేశాం. క్లిప్‌, క్లాప్స్‌ మాడ్యూల్స్‌ రచయితల్లో నేనూ ఒకరిగా ఉన్నారు. సిసిఆర్‌టి న్యూఢిల్లీ వారు నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొని జాతీయస్థాయిలో టిఎల్‌ఎం తయారీలో రెండుసార్లు ఉదయపూర్‌ (రాజస్థాన్‌) లోను, న్యూఢిల్లీలోనూ జాతీయస్థాయి ప్రథమ స్థానం పొందాను. ప్రస్తుతం రాష్ట్ర కీ రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరిస్తున్నా.
                                                                                           - మానుకొండ రాజేంద్రబాబు