Jun 29,2023 07:50

వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని భర్త వదిలేసి పోయాడు. ముగ్గురు ఆడపిల్లలతో ఒంటరితల్లిగా బతుకు పోరాటం ప్రారంభించిన ఆమె పేరు కృష్ణవేణి (32). తమిళనాడు విల్లుపురానికి చెందిన ఆమె ఇరులి గిరిజన తెగకు చెందిన మహిళ. భర్త నిరాదరణకు గురైన ఆమె ఏమాత్రం నిరాశ పడకుండా బిడ్డల పోషణ కోసం ఇళ్లల్లో పాచి పనులు చేసింది. వ్యవసాయ కూలీగా మారింది. అయినా ఆ ఇంటి భారం ఆమెకు పెద్ద సమస్య. 'ఎన్నాళ్లీ కష్టాలు.. ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి' అని బలంగా అనుకుంది. ఆలస్యం చేయకుండా 13 ఏళ్లకే అర్ధంతరంగా స్వస్తి చెప్పిన తన చదువును మళ్లీ కొనసాగించింది. అలా 2022లో తన కూతురు చదువుతున్న పాఠశాలలోనే పదవ తరగతిలో చేరి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తోంది. ఆమె చదువుకుంది చాలా చిన్న చదువే.. కానీ 'నా చదువు నా కుటుంబానికి వెలుగు ఇస్తుంది.. నాలాంటి వారు ఈ దారిలో నడిచేందుకు బాట వేస్తుందని' గట్టిగా చెబుతున్న కృష్ణవేణి తన జీవిత ప్రయాణం గురించి ఇలా చెబుతోంది..
'నాకు 16 ఏళ్లప్పుడు పెళ్లయ్యింది. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టాను. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అందరూ సంతోషించారు. ఆ తరువాత కూడా ఆడపిల్ల పుట్టేసరికి నాపై వేధింపులు మొదలయ్యాయి. మగపిల్లవాడి కోసం మూడోసారీ తల్లయ్యాను. ఈసారీ ఆడపిల్ల పుట్టిందని నా భర్త వదిలేసి వెళ్లిపోయాడు. వేరే పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల నుండి నేనే నా బిడ్డలకి తల్లీ, తండ్రి అయ్యాను. పుట్టింటికి చేరినా.. అమ్మానాన్న మానసికంగా ధైర్యం ఇవ్వగలవారే గాని ఆర్థికంగా సాయం చేయలేని స్థితిలో ఉన్నారు. మేకల పోషణ చేసే వారి నుండి నేను కూడా ఏమీ ఆశించలేదు. అందుకే నా బిడ్డల పోషణ కోసం నేనే ఇంటింటికీ తిరిగి పని వెతుక్కున్నాను. ఇళ్లల్లో పనులు చేసి, వ్యవసాయ కూలీగా వెళ్లాను. రోజుకు రెండు పనులు చేస్తున్నా రూ.100 నుండి రూ.150 మాత్రమే సంపాదించడంతో పిల్లల పోషణ కష్టమయ్యేది' అంటూ తన గత అనుభవాలను చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో బిడ్డల బాగు కోసం ఎందరో ఒంటరి తల్లులు పడుతున్న ఆవేదన కనిపిస్తోంది.

  • బిడ్డకు తెలియకుండా ఏడ్చేదాన్ని..

కృష్ణవేణి పెద్ద కూతురు కవిత గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. క్రమం తప్పకుండా వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. 'ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా దారి ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఎన్నోసార్లు కూతురుకు కనపడకుండా కొంగు అడ్డం పెట్టుకుని ఏడ్చేదాన్ని. నా కమ్యూనిటీ ద్వారా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎంతోమందిని అడిగేదాన్ని. అయినా ఎవరూ సాయం చేయలేదు. ఏం చేయాలో పాలుపోక రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. ఆర్థిక భారానికి తోడు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల భవిష్యత్తు కోసం నేను కచ్చితంగా ఏదైనా మెరుగైన ఉపాధి చూసుకోవాల్సిందేనని నిశ్చయించుకున్నాను. కానీ ఎలా.. చదువే మా బతుకులు బాగు చేస్తుందని నాకు తెలుసు. అందుకే ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు.. అనుకుని.. పెద్దపిల్ల చదువుతున్న స్కూల్లో పదోతరగతిలో నా పేరు కూడా నమోదు చేసుకున్నాను' అంటూ తను తీసుకున్న గొప్ప నిర్ణయం గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో మెరుపు కనపడింది.

  • ఇంటి పనులు, చదువు..

పనులు చేసుకుంటూ బడికెళ్లడం కృష్ణవేణికి సాధ్యపడలేదు. దీంతో స్కూల్లో చెప్పిన పాఠాలు కూతురు నుండి అడిగి తెలుసుకునేది. ఇంటిదగ్గర తను నేర్చుకున్న పాఠాలు కూతురుతో చర్చించేది. ఇలా ఇద్దరూ పరీక్షలకు సిద్ధమై ఉత్తీర్ణత సాధించారు. వారు సాధించింది చాలా చిన్న విజయమే కావచ్చు.. కానీ ఇది వారి జీవితాల్లో ఓ వెలుగురేఖకు కారణమౌతుందని వారు కొండంత ఆశతో ఉన్నారు. 'అమ్మ పదోతరగతి ఉత్తీర్ణత సాధించి మా కమ్యూనిటీలో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు అమ్మకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని, మా బతుకులు బాగుపడాలని మేమంతా కోరుకుంటున్నాం' అంటూ తల్లి సాధించిన విజయం గురించి చెబుతూనే భవిష్యత్తు గురించి గొప్ప కలలు కంటోంది ఆ చిన్నారి. ఈ కుటుంబం కల నెరవేరాలని మనమూ ఆశిద్దాం.