ఎక్కడో దూరం నుంచి సన్నగా అజాఉన్
లోపల్నుంచి జీవ గడియారం
అలారం మోగిస్తాయి
కలల్ని ముగించి కాలంలోకి రమ్మని.
తనువూ మనసూ యేళ్లుగా అలవాటైపోయాయి
తమవైన ఘడియల్ని ఎలా చేజార్చుకుంటాయి
గీ... మంటూ కీచురాళ్ల రొద
హృదయపు లోతుల్ని తాకే
ప్రకృతి నిశ్శబ్ద సంగీతం
వెళ్లొస్తామంటూ పిట్టలు పాడే
సామూహిక వీడ్కోలు గీతాలు
దేహంలోనూ... మెదడులోనూ...
ప్రేమ తరంగాలో... ప్రేరక కంపనాలో...
నింపి తేజవంతం చేస్తాయి.
ఒకటీ... రెండూ... మూడూ...
అడుగులు లెక్కెడ్తూనో
నడక పొడవును కొలుస్తూనో
వెలుతురుగా విచ్చుకుంటున్న చీకటి
తిరిగి చూడకుండా తరలిపోతుంది.
ఇది నిన్నటి ప్రభాత గీతం
ఇప్పుడంతా ఉనికి కోసం ఆరాటం
దేవుళ్ళూ అందుకు అతీతం కాదు
సుదూర అజాఉన్‌కు పోటీగానో కోరస్ గానో
సమీపంలో బహుళ ప్రతిధ్వనుల సల్లల్లాహులు
ఒక్కో దేవుడు ఒక్కో ఆవాసంలో
కొలువై కూర్చున్నాక
వీధి మొత్తం పుణ్యతీర్థమే
ప్రతి దేవుడూ దేవతా
తమ ఉనికిని చాటుకుంటూ
లౌడ్ స్పీకర్ల నుంచి స్తోత్ర తరంగాలను
దిక్కుల్లోకి విసిరేస్తుంటారు
ఇక కీచురాళ్ల రాగాలు
వేకువ పాడే మౌనగీతాలు
చీకట్లోనే కలిసిపోతాయి
రేయితో పాటే సెలవు తీసుకుంటాయి
వేలుపులంతా కట్టకట్టుకొని
వేకువనిలా వెలేస్తారు!
- ప్రగతి
కల - జీవితం
నిద్ర కనికరిస్తే
స్వప్నం సాక్షాత్కరిస్తుంది
ఇల కాదని తెలిసినా
అది కరిగేవరకూ
అదే నిక్కమనుకొని
అందులో జీవించాల్సిందే
నీ మాట నీకే వినిపించకున్నా
ఎవరికీ అర్థం కానట్టు
నీ కలలో నీకు తెలిసినా
అది నిజమన్న ఊహలో ఉంటావు
జీవితాన కూడా అదే భ్రమలో
నీ పలుకులు అందరూ
ఇష్టపడుతున్నారన్న ఊహతో
నీ ఆశల పల్లకిని నీతోపాటు
అందరూ మోస్తారనుకున్న
నీ అమాయకత్వానికీ
నీ భ్రమలే సాక్ష్యం
ఏమరుపాటున నమ్మిన
ఎందరి నైజాలో బయటపడి
నీ సూత్రాలు సూత్రీకరణలు
తప్పులుగా బయటపడ్డప్పుడు
కల ఊహ నిజం విడివిడిగా
అగుపడి అదేమిటని చూస్తే
అది నేనేనంటుంది జీవితం!
- జంధ్యాల రఘుబాబు
98497 53298










