Sep 17,2022 08:07
  • బంధువుల ఇళ్లపై కూడా ...
  • హైదరాబాద్‌లోని గోరంట్ల కార్యాలయంలోనూ తనిఖీలు
  • దేశవ్యాప్తంగా 43 చోట్ల సోదాలు

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని నెల్లూరు, తెలంగాణలోని హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 43 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీకి చెందిన ఇడి అధికారులు 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని, ఇందులో పలువురికి సంబంధం ఉందని వచ్చిన ఆరోపణల ఈ నేపథ్యంలో ఆ దాడులు జరిగాయి. ఒంగోలు వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయా ల్లోనూ, ఆయన బంధువుల ఇళ్లల్లోనూ, హైదరాబాద్‌ లోని గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయాల్లోనూ ఇడి అధికారుల బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. మూడు బృందాలు నెల్లూరుకు చేరుకున్నాయి. గాంధీ బొమ్మ ప్రాంతంలోని రాయాజీ వీధిలోగల మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయానికి ఉదయం ఏడు గంటలకు ఐదుగురు సభ్యుల బృందం వచ్చింది. ఈ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకుంది. అక్కడి ఇనుప బీరువాలోని సింగరాయకొండ లిక్కర్‌ ఫ్యాక్టరీకి సంబంధించి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సిఆర్‌పిఎఫ్‌ ఆధ్వర్యాన గట్టి పోలీసు బందోబస్తు సాయంత్రం ఇడి సోదాలు వరకు కొనసాగాయి. ఈ సమయంలో లోనికి ఎవరినీ అనుమతించలేదు. మీడియాను సైతం వెళ్లనీయలేదు. ఢిల్లీలోని మాగుంట శ్రీనివాసులురెడ్డి నివాసంలోనూ, తమిళనాడు రాష్ట్రం చైన్నైలోని ఆయనకు చెందిన కంపెనీల్లోనూ ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో నివాసముంటున్న కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ సోదరుడు శివరామకృష్ణారెడ్డి, మాగుంట లేఅవుట్‌లోని మాగుంట ముఖ్య సన్నిహితులు పి.వి.ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్లల్లోనూ ఇడి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని గోరంట్ల అసోసియేట్స్‌ చెందిన రాయదుర్గం, దోమలగూడలోని కార్యాలయాల్లో ఇడి బృందాలు సోదాలు నిర్వహించాయి. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఇడి అధికారులు ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు నిర్వహించారు. గతంలో కోకాపేట్‌లోని రాబిన్‌ డిస్టలరీస్‌ యజమాని రామచంద్ర పిళ్లై నివాసం, నానక్‌రామ్‌గూడలోని రాబిన్‌ డిస్టలరీస్‌ కార్యాలయాల్లో ఇడి సోదాలు జరిగాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను చేసిన స్ట్రింగ్‌ ఆపరేషన్లో అవకతవకలు బయటపడ్డాయని బిజెపి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా నెట్‌వర్లకు సంబంధించిన ప్రదేశాల్లో ఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం సహా 26 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. శుక్రవారం నిర్వహించిన సోదాల వివరాలపై ఇడి అధికారులు ఎటువంటి అధికారిక సమాచారమూ వెల్లడించలేదు. కాగా, లిక్కర్‌ స్కామ్‌లో గత వారంలో ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యాన, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకతో సహా 45 చోట్ల సోదాలు చేసింది. గత ఆగస్టు 19న కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఇఎఎస్‌ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవ గోపికృష్ణ నివాసాలతోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఈ పాలసీని ఉపసంహరించుకుంది.