
న్యూఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు కేంద్రం ఎన్నికల సంఘం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగానూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ప్రియాంకకు ఇసి ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. ఈ నెల 20న దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగిస్తూ.. 'ప్రధాని మోడీ ఒక ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్‌ను తెరిస్తే.. అందులో కేవలం రూ.21 మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, ప్రజలకు బిజెపి ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ కవరు లాంటివే. అందులో ఏమీ ఉండవు' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన ఈ వీడియోపై బిజెపి ఫిర్యాదు చేయడంతో ఇసి ఆమెకు నోటీసులు జారీచేసింది.