Oct 28,2023 15:14

న్యూఢిల్లీ : పాలస్తీనా- ఇజ్రాయెల్‌ వివాదంలో మానవతా సంధికి ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. 'పౌరుల రక్షణ, చట్ట పరమైన, మానవతా బాధ్యతలను సమర్థించడం' అనే పేరుతో జోర్డాన్‌ రూపొందించిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌కి భారత్‌ దూరంగా ఉంది. జోర్డాన్‌ తీర్మానానికి భారత్‌ దూరం కావడం పట్ల కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 'గాజాలో కాల్పుల విరమణ కోసం మన దేశం ఓటింగ్‌కి దూరంగా ఉన్నందుకు నేను ఆశ్చర్యపోయాను. భారత్‌ ఓటు వేయనందుకు సిగ్గుపడుతున్నాను. మన దేశం అహింస, సత్యం సూత్రాలపై స్థాపించబడింది. ఈ సూత్రాలపై నిలబడే మన స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. ఈ సూత్రాలే మన జాతీయతను నిర్వచించే రాజ్యాంగానికి ఆధారం. ఓరకంగా అంతర్జాతీయ సమాజంలో సభ్యునిగా దాని చర్యలకు మార్గనిద్దేశం చేసిన భారతదేశం యొక్క నైతిక ధైర్యానికి వారు ప్రాతినిధ్యం వహిస్తారు. అలాంటిది.. గాజాలో ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, కమ్యూనికేషన్‌, విద్యుత్తు లేక లక్షలాది ప్రజలు అల్లాడిపోతున్నారు. మహిళలు, పిల్లలు హత్యకు గురవుతున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి ఒక దేశానికి అండగా నిలబడాల్సిన మన దేశం, మానవత్వంలోని ప్రతి చట్టాన్ని తుడిచిపెట్టే సమయంలో ఒక స్టాండ్‌ తీసుకోవడానికి నిరాకరించడం విరుద్ధం.' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
జోర్డాన్‌ తీర్మానానికి అనుకూలంగా 121 దేశాలు ఓటు వేయగా.. 44 దేశాలు ఓటింగ్‌కి గైర్హాజరయ్యాయి. 14 దేశాలు ఓటింగ్‌ని వ్యతిరేకించాయి.