Nov 19,2022 08:26
  • ఆన్‌లైన్‌లో సాగులు
  • ఖాళీగా భూములు
  • మెట్ట ప్రాంతాల్లో 30-40 శాతం అంతే
  • ఖరీఫ్‌లో కొత్త ట్రెండ్‌


ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఆన్‌లైన్‌లో పంటలు సాగైనట్లు నమోదవుతుండగా భూములు ఖాళీగా కనిపిస్తున్న వింత ధోరణి ఈ ఖరీఫ్‌లో చాలా చోట్ల సాక్షాత్కరిస్తోంది. వర్షాధారంపై పంటలు సాగయ్యే మెట్ట ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాయలసీమ, ప్రకాశం, ఇతర మెట్ట ప్రాంతాల్లో 'డిజిటల్‌' సాగు బాగా కనిపిస్తోంది. వరి పండే మాగాణి పొలాల్లోనూ అక్కడక్కడ ఆన్‌లైన్‌లోనే నాట్లు నమోదవుతున్నాయి. చేలు ఖాళీగా ఉంటున్నాయి. రైతులు పంటలు వేయకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వ్యవసాయశాఖ సిబ్బంది ఇ-క్రాప్‌ పోర్టల్‌లో ఎక్కిస్తున్నారు. తద్వారా సేద్యం బాగా జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఖరీఫ్‌లో సాగైందంటున్న విస్తీర్ణంలో దాదాపు 15-20 లక్షల ఎకరాల్లో పంటలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితమని, పొలాలు బీళ్లుగా కనిపిస్తున్నాయని విమర్శలొస్తున్నాయి. రైతు భరోసా, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ, పంటల కొనుగోళ్లు, పంట రుణాలు.. ప్రతి దానికీ ప్రభుత్వం ఇ-క్రాప్‌ బుకింగ్‌ను తప్పనిసరి చేసింది. ఖరీఫ్‌ పంటల నమోదు ప్రక్రియ నిన్న మొన్నటితో ముగించారు. హార్టికల్చర్‌తో కలుపుకొని కోటి పది లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు పేర్కొన్నారు. కాగా క్షేత్ర స్థాయి పరిస్థితి ఆ విధంగా లేదు. చాలా చోట్ల ఖాళీ భూములను పంట పొలాలుగా నమోదు చేశారు.
 

                                                                     15-20 లక్షల ఎకరాలు !

ఈ ఖరీఫ్‌లో 92.42 లక్షల ఎకరాల్లో పంటల సాగును ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది. సాధారణ సాగు విస్తీర్ణం 92.05 లక్షల ఎకరాలు కాగా 86.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నార్మల్‌లో ఐదున్నర లక్షల ఎకరాలు సాగు కాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మొక్కజొన్న, పత్తి తప్ప అన్ని పంటలూ తగ్గాయి. ఈ లెక్కలు కూడా తప్పేనని క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌లో వర్షాధారంపై పంటలు పండే ఏరియా దాదాపు 50 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. దానిలో 30-40 శాతం అసలు విత్తనం పడలేదని రైతులు చెబుతున్నారు. అంటే 15-20 లక్షల ఎకరాల్లో సాగు లేదు. కానీ ఇ-క్రాప్‌లో మాత్రం ఆ పొలాల్లో పంటలు వేసినట్లు నమోదు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వరి సైతం పూర్తి స్థాయిలో సాగు కాలేదు. అయినా సాగైనట్లు ఆన్‌లైన్‌లో ఎక్కించారని ఆరోపణలొస్తున్నాయి.
 

                                                                                స్కీముల ఎర

ఇ-క్రాప్‌ ఉద్దేశం పక్కాగా సాగుల నమోదు. కాగా అది అక్రమాలకు, అవకతవకలకు బాగా పనికొస్తోంది. ప్రతి పొలం వద్దకూ సిబ్బంది వెళ్లి రైతును పంట మధ్యలో నించోపెట్టి ఫొటో తీసి బయోమెట్రిక్‌ పద్ధతిలో వేలిముద్రలు తీసుకొని వెబ్‌లాండ్‌లో భూమి వివరాలు సరిచూసి అప్‌లోడ్‌ చేయాలి. ఫొటోను అప్‌లోడ్‌ చేయకపోయినా పర్వాలేదనే సడలింపు ఉన్నందున పంట వేసినా వేయకపోయినా వేలిముద్రలు తీసుకొని అప్‌లోడ్‌ చేస్తున్నారు. రైతు భరోసా, సబ్సిడీ సీడ్‌ తీసుకుంటే తప్పనిసరిగా పంట వేయాలని, వేయకపోయినా వేసినట్లు నమోదు కావాలని రైతులను మభ్యపెట్టి రికార్డుల్లో ఎక్కిస్తున్నారు. సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, పంట రుణాల రెన్యువల్స్‌ అని లోబరుచుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఇ-క్రాప్‌లో సాగు సాధారణ స్థాయిలో జరిగితే కరువు, వరదలు, డ్రై-స్పెల్స్‌ వచ్చినా కరువు, విపత్తు మండలాలు ప్రకటించకుండా ప్రభుత్వం తప్పించుకునేందుకు 'ఇ-పంట' బాగా ఉపయోగపడుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. రైతులు ప్రభుత్వ సంస్థలకు పంటలు అమ్ముకోవాలంటే ఇ-క్రాప్‌ తప్పనిసరి. ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువకు పంటలు కొనుగోలు చేసి, పంట వేయని రైతుల వద్ద నుంచి ఇ-క్రాప్‌ పత్రాలను సేకరించి, వాటితో ప్రభుత్వానికి మద్దతు ధరపై అమ్ముకుంటున్నారు. రైతులేమో పెట్టుబడి ఖర్చులు పెరిగి సాగు పట్ల విముఖత చూపుతున్నారు.