న్యూఢిల్లీ : ఆర్‌బిఐ మాజీ గవర్నర్ వెంకిటరమణన్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్య కారణంగా ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్‌బిఐ 18వ గవర్నర్‌గా వెంకిటరమణన్ బాధ్యతలు నిర్వహించారు. 1990 డిసెంబర్ 22 నుంచి 1992 డిసెంబర్ 21 వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు. దేశం తీవ్రమైన చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో ఆయన సమర్ధవంతమైన సేవలందించారని ఆర్‌బిఐ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా 1985 నుంచి 1989 వరకు ఆయన పనిచేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు కర్ణాటక ప్రభుత్వ సలహాదారుగా కూడా విధులు నిర్వహించారు. ట్రావెన్‌కోర్ సంస్థానంలో భాగమైన నాగర్‌కోయిల్‌లో 1931లో ఆయన జన్మించారు. ఆయన తిరువనంతపురం యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ సమయంలో స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో క్రియాశీలంగా పనిచేశారు. తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాధన్, సుధా ఆయన కుమార్తెలు.