ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీ రేట్లను వరుసగా నాలుగోసారి యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసి కమిటీ (ఎంపిసి) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బిఐ గవర్నరు శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. ద్రవ్యోల్బణంపై అనిశ్చితి కొనసాగుతోందని, బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా ఉందని అన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి కీలక పంటల సాగు ఖరీఫ్‌లో ఆటంకం ఏర్పడటం, రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు తగ్గడంతో అంతర్జాతీయంగా ఆహార ధాన్యాలు, విద్యుత్ ఖర్చులు పెరిగాయని .. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.2 శాతానికి తగ్గవచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది.