Sep 13,2023 21:17
  • లేదంటే రోజుకు రూ.5వేల జరిమానా
  • రుణదాతలకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : రుణగ్రహీతలు అప్పు పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా సంబంధిత ఆస్తి పత్రాలు ఇవ్వడానికి అనేక బ్యాంక్‌లు, ఎన్‌బిఎఫ్‌సిలు ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆర్‌బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. రుణం చెల్లించిన 30 రోజుల్లోగా సంబంధిత ఆస్తి పత్రాలు ఖాతాదారులకు అందించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మరోమారు ఆదేశాలు జారీ చేసింది. బాధ్యాతాయుత రుణాల జారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం వెల్లడించింది. రుణ చెల్లింపులు పూర్తయిన 30 రోజుల్లోగా స్థిర, చరాస్తుల సంబంధించిన పత్రాలను రుణగ్రహీతలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై 2003 నుంచే స్పష్టమైన నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నప్పటికీ.. అనేక విత్త సంస్థలు అవి పాటించకుండా ఖాతాదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై ఆర్‌బిఐకి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వాటితో పలు వివాదాలు తలెత్తుతున్నాయని ఆర్‌బిఐ తెలిపింది. ఈ నేపథ్యంలో రుణదాతల్లో బాధ్యతాయుత రుణ జారీలను ప్రోత్సహించడం కోసమే కొత్తగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించింది.
కొత్త మార్గదర్శకాలు 2023 డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఒకవేళ రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా పత్రాలను ఇవ్వలేకపోతే.. అందుకుగల కారణాలను తెలియజేస్తూ బ్యాంకులు ఖాతాదారులకు సమాచారం అందించాలి. సరైన కారణాలు లేకుండా విత్త సంస్థలు జాప్యం చేస్తే.. రుణ గ్రహీతలకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పత్రాలు కనపడకుండా పోతే.. వాటిని తిరిగి పొందేలా రుణగ్రహీతలకు సాయం చేయాలి. అలాగే అందుకు అయ్యే ఖర్చును మొత్తం బ్యాంక్‌లే భరించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆలస్యానికి గాను రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బిఐ నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
రుణ గ్రహీతలు తమ స్థిర లేదా చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే సంబంధిత విత్త సంస్థలు లేదా వాటికి సంబంధించిన కార్యాలయాల నుంచి తీసుకోవాలని ఆర్‌బిఐ సూచించింది. ఒకవేళ రుణగ్రహీతల అకాల మరణం సంభవిస్తే పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా బ్యాంక్‌లు, బ్యాంకింగేతర విత్త సంస్థలు పక్కాగా రూపొందించాలని పేర్కొంది. ఆ విషయాలను సంస్థ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా పొందుపర్చాలని ఆర్‌బిఐ ఆదేశించింది.