Oct 18,2023 10:23

కలకత్తా నగరం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. శక్తి స్వరూపానికి మారుపేరుగా మహిళను అమిత గౌరవంగా పూజించే ఆ సమాజంలో తరతరాలుగా దుర్గ విగ్రహాలు చేయడం ఆనవాయితీ. విగ్రహాల తయారీలో ఎంతోమంది సిద్ధహస్తులు అక్కడ ఉన్నారు. అయితే దుర్గ విగ్రహాలు చేయడానికి మాత్రం అక్కడ మహిళలకు అనుమతి లేదు. ఏళ్లకు ఏళ్లు ఇదే సాగుతోంది. అలా నగరంలో విగ్రహాలు తయారుచేసే కుమర్తులి ప్రాంతంలో పుట్టిన మాలాపాల్‌ ఆ ధోరణికి అడ్డుకట్ట వేసింది.

33

తండ్రి ఉన్ననాళ్లూ ఆమెను అటువైపుగానే రానీయలేదు. అన్నలు, తమ్ముళ్లు మాత్రం విగ్రహాల పనిలో తలమునకలయ్యేవారు. తాను కూడా విగ్రహాలు తయారుచేస్తానని ముందుకువచ్చిన ప్రతిసారీ 'ఇక్కడ నీకు పనిలేదు.. ఇంట్లో అంట్లు తోముకో' అని సమాధానం వచ్చేది. ఈ పనిని పురుషులు మాత్రమే చేయగలరు అన్న ధోరణే అక్కడ ఎక్కడ చూసినా కనిపించేది. అయినా మాల వెనక్కితగ్గలేదు. తన 14 ఏళ్ల వయసులో బొమ్మల తయారీకి సిద్ధమైంది. అయితే అప్పటికి ఆమె తండ్రి మరణించారు.
           1985 నుండి తన ప్రయాణం ప్రారంభించిన మాల ప్రస్తుతం బొమ్మల తయారీ పాఠశాలనే నడుపుతున్నారు. 'బాల్యంలో నన్ను ఎందుకు అనుమతించడం లేదని తెగ ఆలోచించేదాన్ని. నాన్నను ఎదిరించే ధైర్యం లేదు. మేం ఉంటున్న ప్రాంతమంతా విగ్రహాలు తయారుచేసేవాళ్లు. ఎక్కడా మహిళలు కనిపించేవారు కాదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకపక్క శక్తిస్వరూపిణిగా మహిళను పూజించడం, మరోపక్క ఆమెను అశక్తురాలిగా పరిగణించడం అర్థమయ్యేది కాదు. అందుకే పట్టుదలగా బొమ్మలు తయారు చేయడం నేర్చుకున్నా' అంటూ బాల్యంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
 

                                                                        పాఠశాల ప్రారంభం ఇలా..

'పాఠశాల ప్రారంభించాలన్నది నా లక్ష్యం కాదు. ఈ పని మహిళలు కూడా చేయగలరు అని మాత్రమే నిరూపించాలనుకున్నాను. పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా ఒక అభిరుచిగా, ఈ వృత్తిని కొనసాగించాను. అయితే యుక్తవయసు వచ్చిన నా కూతురు చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైంది. నేను చేస్తున్న వృత్తిపై ఆమెకు అవగాహన కూడా లేదు. కనీసం దాన్ని ప్రోత్సహించే చొరవ కూడా ఎప్పుడూ చేయలేదు. అప్పుడు.. నా చిన్నతనంలో చూసిన మా ప్రాంతాన్ని మరొకసారి పరిశీలించాను. అక్కడ పనిచేస్తున్న వారంతా వయసుపైబడ్డ వారే. అంటే ఈ కళ ఇక్కడితో ఆగిపోతుంది. ఈతరం వాళ్లు ఇటువైపు కూడా చూడడం లేదు. ఈ పరిస్థితి నన్ను ఆందోళనకు గురిచేసింది. కళను బతికించుకోవాలంటే కొత్త తరాన్ని తయారుచేయాలి. అందుకు మొదటి అడుగు నేనే వేయాలని నిర్ణయించుకున్నాను.
          ఇప్పుడు నేను ప్రారంభించిన పాఠశాలలో మూడు బ్యాచ్‌ల్లో 34 మంది విద్యార్థులు బొమ్మలు తయారుచేయడం నేర్చుకుంటున్నారు. విగ్రహాలు తయారుచేయడమే కాదు. రకరకాల జంతువులు, పక్షుల బొమ్మలు కూడా నేర్పిస్తాను. కళకు పరిమితులు లేవు. నేర్చుకుంటే ప్రతిఒక్కటీ సాధ్యమవుతుంది. ఇక్కడ బొమ్మలు తయారుచేసే పిల్లలు మట్టిముద్దలతో మొదలుపెట్టి వస్త్రాలు, నగలు వంటివి కూడా వారే స్వయంగా చేస్తారు' అంటున్న మాలా టెర్రకోట నగలు చేయడంలో సిద్ధహస్తులు.
         పశ్చిమ బెంగాల్‌లో సుప్రసిద్ద హస్తకళ టెర్రకోట నగలు. వాటిని తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ కళలో కూడా మాల రాణిస్తున్నారు. ఆమె చేసిన నగలు కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌ వంటి దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. 'నా దగ్గరకు వస్తున్న విద్యార్థులు 7, 8 ఏళ్ల వారే. వీళ్లల్లో ఎవరైనా భవిష్యత్తులో దీన్ని ఒక వృత్తిగా తీసుకుంటే నా లక్ష్యం నెరవేరినట్లే' అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.