రుణ గ్రహీతలకు నిరాశ
కీలక రేట్లు యథాథతం
ఆర్‌బిఐ నిర్ణయం
వృద్థి 6.5 శాతమే
ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చు
గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్ వేళ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గొచ్చని ఆశపడిన వారికి నిరాశనే ఎదురయ్యింది. 6.5 శాతం గరిష్ట స్థాయికి చేరిన రెపో రేట్లను ఈ దఫా అయినా తగ్గిస్తారని రుణ గ్రహీతలు ఎదురు చూశారు. అందుకు భిన్నంగా ఆర్‌బిఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయించింది. మరోవైపు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో బుల్లెట్ పేమెంట్ స్కీమ్ కింద బంగారు రుణాలను రెండింతలు పెంచి రూ.4 లక్షలకు చేర్చడం సానుకూలాంశం. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) నిర్ణయాలను శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు. రెపో రేటును ఇంతక్రితం స్థాయిలోనే 6.5 శాతంగా నిర్ణయించామన్నారు. ఇందుకు ఎంపిసి సభ్యుల ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. రెపో రేటులో మార్పులు చేయకుండా ఉంచడం ఇది నాలుగోసారి. ఆర్‌బిఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య వరుసగా వడ్డీ రేట్లను పెంచింది. ఆరు సార్లలో 2.50 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచి 6.50 శాతానికి చేర్చింది. దీంతో వడ్డీ, వాయిదా చెల్లింపులు ఎక్కువై రుణాలు భారం అయ్యాయి. ఈ క్రమంలోనే అనేక మంది గృహ, వాహన, వ్యక్తిగత రుణ గ్రహీతలు ఇకనైనా వడ్డీ రేట్లలో తగ్గుదల ఉండొచ్చని ఈ దఫా ఆశించారు.
''ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. ఎంఎస్‌ఎఫ్, బ్యాంక్ రేట్ 6.75 శాతం వద్దే కొనసాగింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 6.5 శాతం వృద్థిని నమోదు చేయవచ్చు. సెప్టెంబర్ 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉంది. వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గవచ్చని అంచనా. నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.'' అని శక్తికాంత దాస్ తెలిపారు.
''వృద్థి బలంగానే ఉన్నప్పటికీ.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు నిర్ణయాల పరంగా దూకుడును కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయి. ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తునే దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. ద్రవ్యోల్బణ లక్ష్యం నాలుగు శాతమే. కూరగాయలు, వంట గ్యాస్ ధర దిగిరావడంతో సెప్టెంబరులో ద్రవ్యోల్బణం తగ్గొచ్చు. 2023- 24లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా. మూడో త్రైమాసికంలో ఆహార పదార్థాల ధరల్లో స్థిరమైన తగ్గుదల నమోదయ్యే సూచనలు లేవు. ప్రస్తుతం 6.8 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గొచ్చు.'' అని దాస్ అన్నారు.
అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద ఉన్న రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్‌లో బంగారంపై తీసుకున్న రుణాలకు వడ్డీ, అసలు ఒకేసారి చెల్లించే సదుపాయం ఉంటుంది. సాధారణంగా బంగారంపై రుణాలకు ప్రతీ నెల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
రూ.2వేల నోటు మార్పిడికి వెసులుబాటు..!
రూ.2,000 నోటు సాధారణ మార్పిడికి వెసులుబాటు కల్పించారు. ఇంకా మార్కెట్‌లో రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని శక్తికాంత దాస్ వెల్లడించారు. పెద్ద నోటు ఉపసంహరణ ప్రకటన తర్వాత ఇప్పటి వరకు 96 శాతానికి పైగా నోట్లు బ్యాంకింగ్‌లోకి తిరిగి వచ్చాయన్నారు. వీటి విలువ రూ.3.43 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఇందులో 87 శాతం బ్యాంక్ డిపాజిట్లుగా వచ్చాయని, మిగిలినవి ఇతర నోట్లతో ఎక్సేంజీ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా.. అక్టోబర్ 8వ తేదీ తర్వాత కూడా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయన్నారు. రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మే 19న ఆర్‌బిఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.