Oct 15,2023 21:58

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌ నజీర్‌, మంత్రి రోజా
ప్రజాశక్తి- యంత్రాంగం :విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వపనాభిషేకం అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుండి దర్శనం కల్పించారు. శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా శ్రీ దుర్గమ్మ సందర్శకులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు దర్శించుకున్నారు. వారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కెఎస్‌.రామరావు, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు తదితరులు గవర్నర్‌ను అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటాన్ని గవర్నర్‌ దంపతులకు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె రోజా ఉన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాత్రికులు పోటెత్తారు. క్యూ లైన్లు కిటకిటలాడాయి. మొదటి రోజు సుమారు 80 వేల మంది వరకూ దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు.

  • పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడు తలల పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో విహరించారు. తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన జీయర్‌స్వామి, టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలోనూ ప్రారంభమైన దసరా మహోత్సవాలు
శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. నవదుర్గ అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు.