Oct 20,2023 10:50

ప్రజాశక్తి - యంత్రాంగం:శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు దుర్గమ్మను జగన్మాత చండీదేవి రూపంలో అలంకరించారు. దాదాపుగా 70 సంవత్సరాల తరువాత ఈ రూపంలో దుర్గమ్మను అలంకరించడంతో అమ్మవారిని చూసేందుకు యాత్రికులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు అంచనా వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గమ్మకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేడు సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను అలంకరించనున్నారు.

  • మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మలయప్పస్వామివారిని మోహినీరూపంలో ఊరేగించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. యాత్రికులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి 6.30 గంటలకు గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారిని ఊరేగించారు. అస్సాంకు చెందిన బిహు, మహారాష్ట్రకు చెందిన సోంగి ముఖోటా, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల మోహినీ అవతార నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.రాజమండ్రికి చెందిన పి.సుమన్‌ డ్రమ్స్‌ విన్యాసాలు అలరించాయి. మొత్తం 12 కళాబృందాల్లో 313 మంది కళాకారులు పాల్గని ప్రదర్శనలిచ్చారు.