Jul 15,2023 08:20

పిల్లలూ, ఈ రోజు స్వాతంత్ర సమరయోధురాలు, బహుముఖ ప్రజ్ఞావంతురాలు, విద్యావేత్త దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ జయంతి. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రాజమండ్రిలో 1909 జులై 15న రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ల వయసులో మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. అయితే దుర్గాబాయి ఆ వివాహాన్ని వ్యతిరేకించి చదువుకుంటానని చెప్పారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు ఒప్పుకొని స్కూలుకు పంపించారు. పదేళ్ల వయసులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించిన దుర్గ... ఆ తరువాత రాజమండ్రిలో బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించి అన్ని వయసుల వారికీ విద్యాబోధన అందించారు.
           బెనారస్‌ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌.ఎల్‌.బి పూర్తిచేశారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు గల దుర్గాబాయి స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. ఆంధ్రాలో పర్యటిస్తున్న గాంధీ హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించేవారు. గాంధీ రాకను పురస్కరించుకుని విరాళాలు సేకరించి ఇచ్చారు. తన వంతుగా చేతికి ఉన్న బంగారు గాజులు విరాళంగా ఇచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారు కూడా.
            అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ఆమె ప్రారంభించారు. 1937లో చెన్నపట్నంలో ఆంధ్ర మహిళా సభ స్థాపించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వం వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహం ఏర్పాటుకు కృషి చేశారు. రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్‌ హౌమ్‌లు, వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. 1953లో అప్పటి భారతదేశ ఆర్థికమంత్రి చింతామణి దేశ్‌ముఖ్‌తో ఆమెకు వివాహం జరిగింది. 1971లో ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుంచి 1950 వరకు సభ్యురాలిగా పనిచేశారు. 1952లో ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌ బిరుదుతో సత్కరించింది. 1981 మే నెలలో ఆమె మరణించారు.