

తలనొప్పి.. జ్వరం.., కాళ్లు చేతులు లాగడం.. మెడ, నడుం ఒకటే నొప్పి.. ఇలా రకరకాల నొప్పులతో బాధపడే మహిళలు ఎంతోమంది ఉంటారు. ఉపశమనం కోసం మెడికల్ షాపుల్లో దొరికే మందులో.. డాక్టర్లు ఇచ్చే వైద్యమో ఏదొకటి ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ మందులన్నీ వారికి కచ్చితమైన ఉపశమనాన్ని ఇస్తున్నాయా? అంటే మాత్రం.. కచ్చితమైన సమాధానం లేదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధాలన్నీ రకరకాల క్లినికల్ పరీక్షల్లో సఫలమయ్యాకే వినియోగానికి వస్తుంటాయి. అయితే ఆ పరీక్షలన్నీ మగ జంతువులు లేక మానవుల శరీరాలపై జరిగాయి. రుతుక్రమ సమస్యల వల్ల ఆడ జంతువులు, మానవులు ఈ పరీక్షల నుంచి మినహాయించారు. దీంతో మహిళల ఆరోగ్యంపై ఈ ఔషధాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదానిపై ఎవరూ సమాధానం చెప్పలేరు. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది అంటున్నారు సారా బైలీ. యూనివర్శిటీ ఆఫ్ బాత్‌లో న్యూరోఫార్మకాలజీ సీనియర్ లెక్చరర్ అయిన సారా ఈ క్లినికల్ ట్రయల్స్ గురించి పలు విషయాలు చర్చించారు.
గతంలో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, భిన్న జాతులు మధ్య పెద్దగా వ్యత్యాసం చూపవని శాస్త్రవేత్తలు భావించేవారు. కానీ పరిస్థితి మారింది. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం రెండు భిన్న జాతుల మధ్య విభిన్న ఫలితాలు వస్తాయి. తాజా ఔషధ అధ్యయనాల్లో స్త్రీ, పురుష జంతువులు, మానవుల శరీరాలపై ప్రయోగాలు చేస్తున్నారు.
ఉదాహరణకు మగ ఎలుకలు, ఆడ ఎలుకలపై నిర్వహిస్తున్న ఈ క్లినికల్ ట్రయల్స్‌లో మెదడు పరిణామం, ఆకారం, శరీర భాగాలతో నరాల అనుసంధానం వంటి వన్నీ హైలెట్ చేస్తున్నారు. ఈ పరిశోధనలు ఉత్తమ ఫలితాలు చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఒత్తిడి వల్ల పురుషుడు ప్రభావితమయ్యే తీరుకు రెండు రెట్లు అధికంగా మహిళలు ప్రభావితమవుతారు. అంటే లింగ భేదం, ఒత్తిడి ప్రభావంలో చాలా స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుందన్నది తేలిపోయింది.
పురుషులు కంటే మహిళలు సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్‌టేక్ ఇన్హిబిటర్స్ (ఎస్‌ఎస్‌ఆర్‌ఐ)లు బలమైన ప్రతిస్పందనలను కలిగిఉంటారు. అలాగే పురుషులు టైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్‌కి మెరుగైన ప్రతిస్పందనలు ఇస్తుంటారు. అయితే వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా చాలా కాలంగా క్లినికల్ ట్రయల్స్ నుండి మహిళలను మినహాయిస్తూ వచ్చారు. దీనివల్ల వారి ఆరోగ్యంపై ఆందోళనకర పరిణామాలు వెలుగుచూశాయి. ఉదాహరణకు గుండె సంబంధిత వ్యాధులు, మూర్ఛ, తలనొప్పి, వికారం వంటి వాటికి తీసుకునే ఔషధాల వల్ల మహిళలు తరచూ విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
వ్యాధి తీవ్రత అంచనా పురుషులపై చేసింది కాబట్టి, ఆ సమస్య ఉన్న మహిళలు అదే ఔషధాన్ని తీసుకోవడం వల్ల వారికి పురుషులతో పోలిస్తే సైడ్ ఎఫెక్ట్ రిస్క్ కూడా రెట్టింపు అవుతుంది. పురుషుల కంటే తక్కువ వయసున్న, లేదా సమాన వయసున్న వారైనా సరే పురుషుల వ్యాధి తీవ్రతను ఆధారం చేసుకుని పరీక్షలు చేసిన ఔషధాలనే మహిళలు వాడుతున్నారు. కానీ సెక్స్ హార్మోనుల స్థాయి, ఎంజైమ్‌ల కార్యకలాపాలు స్త్రీ, పురుషుల్లో భిన్నంగా ఉంటాయి. మెటబాలజీ స్థాయిల్లో కూడా తేడా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఔషధాల చర్యల్లో భిన్నమైన ఫలితాలు ఉంటాయి. కానీ చాలాకాలంగా ఒకే రకం మందు వినియోగిస్తున్నారు.

రుతుచక్రం కారణంగా జంతు, మానవులలో మహిళలను ఎక్కువగా మినహాయించారు. హార్మోనుల హెచ్చుతగ్గులు ఫలితాలపై ప్రభావం చూపుతాయని వారిని నిరాకరిస్తూ వచ్చారు. ఒకవేళ కచ్చితంగా ట్రయల్స్ చేయాల్సిన వచ్చినా అది అధిక ఖర్చుతో కూడుకున్నది. పురుషుల్లో ఒకే స్థాయిలో సెక్స్ స్టెరాయిడ్ హార్మోనులు ఉండగా, మహిళల్లో వాటి స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇది మెదడు పనితీరు, ప్రవర్తనపై ప్రభావం చూపిస్తూ.. స్త్రీలలో ఔషధాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.
అయితే గత పరిశోధనల్లో ఆడ ఎలుకలపై చేసిన క్లినికల్ ట్రయల్స్ పెద్దగా వ్యత్యాసాన్ని చూపించలేదు. కానీ మహిళల ఈస్ట్రన్ చక్రంతో పోల్చి చూస్తే.. ఆడ ఎలుకల్లో ఇది నాలుగు లేదా ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ఈ పరీక్షలు మహిళల ఆరోగ్యాన్ని పరిగణించడంలో పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.
పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది
1950లో అభివృద్ధి చేసిన థాలిడోమైడ్ ఔషధం గొప్ప విషాధాన్ని మిగిల్చింది. గర్భిణీలలో ఉదయం వేళ వికారం, కళ్లు తిరగడం వంటి మార్నింగ్ సిక్‌నెస్‌కు ఈ ఔషధాన్ని ఇచ్చేవారు. అయితే గర్భిణీలపై ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ప్రయోగింపబడలేదు. కేవలం పురుషులపై మాత్రమే ట్రయల్స్ చేశారు. ఫలితంగా క్రమంగా ఈ మందులు వేసుకున్న మహిళలు ప్రసవించిన బిడ్డలపై ఇది ప్రభావం చూపించింది. ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది నవజాత శిశువులు కాళ్లు, చేతులు సరిగ్గా అభివృద్ధి చెందకుండా, ఇతర పుట్టుకతో వచ్చే లోపాలతో జన్మించారు. అప్పటికి గాని జరిగిన నష్టాన్ని వైద్యులు గుర్తించలేదు.
పరిస్థితులు మెరుగుపడుతున్నాయి
ప్రస్తుతం రుతుచక్రం, ఔషధాల పరస్పర చర్య, గర్భధారణ సమయంలో మార్పులు, హార్మోన్ల గర్భ నిరోధకత వంటి అంశాలపై పరిశోధనలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ కొన్ని దశాబ్దాల పాటు మహిళలను ట్రయల్స్ నుండి మినహాయించడం వల్ల ఎన్నో విషయాలు తెలియకుండాపోయాయి. అమెరికాలో 1990ల నుండి క్లినికల్ ట్రయల్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని చట్టబద్దం చేశారు. దాదాపు 30 సంవత్సరాల తరువాత అమెరికన్ మెడికల్ రీసెర్చ్ ఏజెన్సీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నిధులు సమకూర్చడంతో క్లినికల్ స్టడీస్‌లో పాల్గొనే సంఖ్యలో మహిళలు దాదాపు సగం మందికి పైగా ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. జీవసంబంధమైన లింగం (జన్యుపరంగా నిర్వచించబడినవి), లింగం (వ్యక్తి స్వీయ గుర్తింపు) రెండింటిలోనూ ఈ పరిశోధనలు చేస్తున్నారు. విశ్లేషణలతో పాటు నివేదికలను ఏకీకృతం చేయడంలో ఇవి అభివృద్ధి చెందుతున్నాయి. వీటిపై సమగ్ర సమాచారం అందించేందుకు కొన్ని శాస్త్రీయ పత్రికలు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి.
దీర్ఘకాలం వేచి చూడాలి
ఈ పరిశోధనల్లో మొదట ఆడ ఎలుకలను భాగస్వామ్యం చేశారు. అయితే ఇందుకోసం చాలా సమయం పట్టింది. 2014లో ఎన్‌ఐహెచ్ ప్రకటనను అనుసరించి ఆడ, మగ కణాలు, జంతువులను పరిశోధనల్లో చేర్చే ప్రక్రియ వేగవంతం చేశారు. వైద్య పరిశోధనలకు నిధులు సమకూర్చే సంస్థల్లో ఒకటైన ఎన్‌ఐహెచ్ పిలుపునందుకుని కెనడియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, యూరోపియన్ కమిషన్‌లు సమకూర్చిన భారీ నిధులతో ఇతర దేశాల్లో ఈ విధానాలను అమలుచేస్తున్నారు. కానీ కొత్త ఔషధాన్ని తయారుచేసేందుకు 10 నుండి 15 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తరువాత క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. అలాగే ఈ ట్రయల్స్‌లో పాల్గొనేవారిని నియమించడంలో ఉన్న అవరోధాలను బట్టి కూడా సమయం పడుతుంది. ఏదేని ఔషధం మహిళల ఆరోగ్యంపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోలేనంత కాలం చాలా ప్రయోజనాల నుండి వారు మినహాయింపుకు గురౌతారు.