Oct 26,2022 08:32
  • లేనే లేదంటున్న కలెక్టర్లు
  • 273 మండలాల్లో డ్రై స్పెల్‌
  • పది శాతం తగ్గిన సాగు
  • నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో కరువు ఉందా? ఈ ప్రశ్నకు లేనే లేదన్నది కలెక్లర్ల సమాధానం. అయితే, సాక్షాత్తు రెవిన్యూ (ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ-డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) శాఖ రూపొందించిన గణాంకాల ప్రకారం క్షేత్రస్థాయి పరిస్థితులు వేరని తెలిసింది. ఈ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో డ్రైస్పెల్‌ (వరసగా వారం రోజుల పాటు చినుకుకూడా పడని స్థితి) మండలాలు భారీగానే ఉన్నట్లు సమాచారం. అంతేకాదు. కలెక్టర్లు కరువులేదని చెబుతున్నప్పటికీ అనేక జిల్లాల్లో పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితిని మదింపు చేయడానికి బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వచ్చే నిర్ధారణల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగం నివేదిక సమర్పించనుందని సమాచారం. కరువు మండలాలు ప్రకటిస్తే రైతులకు ప్రభుత్వం అదనపు సాయం అందించవలసి ఉంటుందన్న విషయం తెలిసిందే.
 

                                                                     డ్రై స్పెల్‌ ఎన్ని మండలాల్లో...!

రెవిన్యూ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం 2022 ఖరీఫ్‌ సీజన్‌లో ఒక డ్రైస్పెల్‌ నమోదైన మండలాలు 228 ఉన్నట్లు తెలిసింది. రెరడు డ్రై స్పెల్స్‌ నమోదైన మండలాలు 43 ఉన్నాయి. రెరడు మండలాల్లో మాత్రం మూడు డ్రైస్పెల్స్‌ రికార్డయ్యాయి. రెరడు డ్రై స్పెల్స్‌ నమోదైన వాటిల్లో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోనే 14 మండలాలు ఉరడగా, ఎన్‌టిఆర్‌ కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ఐదేసి చొప్పున, నెల్లూరు జిల్లాలో నాలుగు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో మూడేసి చొప్పున మండలాలు ఉన్నాయి.
 

                                                                          తగ్గిన పంటల విస్తీర్ణం...

సాధారణ సాగు విస్తీర్ణం కన్నా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పది శాతం పంటల సాగు తగ్గింది. మొత్తం 36,81,573 హెక్టార్లలో సాగు జరగాల్సి ఉరడగా, 33,12,679 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 13 జిల్లాల్లో 90 శాతం కన్నా తక్కువ సాగు విస్తీర్ణర రికార్డయిరది. అతి తక్కువగా అన్నమయ్య జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే నమోదు కావడం విశేషం. ఈ జిల్లాలో మొత్తం 30 డ్రైౖస్పెల్స్‌ నమోదయ్యాయి.
 

                                                                   కలెక్టర్లు ఏమంటున్నారు ?

రెవెన్యూ అధికారులు అడిగిన ప్రశ్నలకు 8 జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో ఎటువంటి కరువు పరిస్థితులు లేవని చెప్పినట్లు తెలిసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్‌టిఆర్‌, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. మిగిలిన జిల్లాల నుండి ఎటువంటి సమాచారం అందలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి కరవు పరిస్థితులు లేవని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించనున్నారని సమాచారం

011