హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 33 శాతం వృద్థితో రూ.1,482 కోట్ల నికర లాభాలు సాధించింది. నిపుణుల అంచనాలు మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. రూ.1,269 కోట్ల లాభాలు చోటు చేసుకోవచ్చని ఎల్‌ఎస్‌ఇజి డేటాలో నిపుణులు అంచనా వేశారు. అమెరికాలో క్యాన్సర్ డ్రగ్ బలమైన అమ్మకాలు ఆర్థిక ఫలితాలకు మద్దతునిచ్చాయి. గడిచిన త్రైమాసికంలో కంపెనీ స్థూల రెవెన్యూ 9 శాతం పెరిగి 6,110 కోట్లుగా చోటు చేసుకుంది. అమెరికాలో అమ్మకాలు 13 శాతం వృద్థితో రూ.3,170 కోట్లుగా, భారత్‌లో 3 శాతం పెరిగి రూ.1,190 కోట్లుగా నమోదయ్యాయి. మరో త్రైమాసికంలోనూ మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించామని ఆ సంస్థ కో ఛైర్మన్ జివి ప్రసాద్ పేర్కొన్నారు. ఇంతక్రితం ఎప్పుడూ లేని స్థాయిలో అమ్మకాలు, లాభాలు నమోదు చేశామన్నారు. యూరప్ రెవెన్యూ కూడా 26 శాతం పెరిగి రూ.530 కోట్లుగా చోటు చేసుకుందని డాక్టర్ రెడ్డీస్ పేర్కొంది. వర్థమాన మార్కెట్ల నుంచి రూ.1220 కోట్ల వ్యాపారం నమోదయ్యిందని తెలిపింది. శుక్రవారం బిఎస్‌ఇలో ఆ కంపెనీ షేర్ 0.72 శాతం తగ్గి రూ.5,385 వద్ద ముగిసింది.