Sep 05,2022 06:32

సకల కళల సమాహారమే నాటకం. మానవ జీవితాలకు, సమాజ వ్యవస్థలకు సంబంధించిన అన్ని కోణాలను యథార్థంగా సరైన కొలతలతో అందించగలిగిన కళారూపం నాటకం మాత్రమే! నాటకమంటే సమాజ సమస్త ప్రయోజనాలను అందించే ఒక హామీ పత్రం. అమ్మపాల కమ్మదనమంత నిజం, నాన్న చెమటచుక్కల సువాసనంత నిజం, పోరాటాల్లో ఎత్తిన పిడికిళ్లు గర్జించినంత నిజం. అందుకే నాటకమంటే ఒక అనుభూతి, ఒక రసానుభూతి, నాటకమంటే ఒకచైతన్య స్ఫూర్తి. ఆ చైతన్యాన్ని శాశ్వతంగా కొనసాగించటానికి నిజాల నిప్పుల కొలిమినుంచి తయారైన ఒక అద్భుత కళారూప సాధనమే 'ప్రజా నాట్యమండలి'.
దైనందిక జీవితంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో 1943లో ప్రజానాట్యమండలి ఏర్పాటైంది. తొలి రోజుల్లో సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపింది. తరువాత జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టే దిశలో ప్రజానాట్యమండలి తన ప్రదర్శనలను అవిశ్రాంతంగా కొనసాగిస్తూ వుంది. ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యల మూలాలను కూకటివేళ్లతో సహా పెకలించటానికి చేస్తున్న ప్రదర్శనలివి. అలాంటి విశిష్టమైన ప్రజానాట్యమండలికి ఆంధ్రరాష్ట్రంలో వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ గరికపాటి రాజారావు గారు.
1915 ఫిబ్రవరి 5న రాజమండ్రిలో ఆయన జన్మించారు. తండ్రి కోటయ్య దేవర, తల్లి సోమలింగమ్మ. ఐదు మంది సంతానంలో నాలుగవ సంతానంగా ఆయన జన్మించారు. అసలు పేరు రామలింగేశ్వరరావు. స్కూల్లో చేర్పించినప్పుడు, కళాత్మకమైన ఆయన ముఖ వర్ఛస్సును చూసి స్కూలు హెడ్‌ మాస్టరు రాజారావుగా ఆయన పేరును మార్చారు. ఆయన బాల్యం, పాఠశాల విద్య, అంతా సికింద్రాబాదులో గడిచింది. రాజారావు గారి తండ్రి అక్కడ లాల్‌ గూడా వర్క్‌ షాపులో సూపర్‌ వైజర్‌ ఉద్యోగం చేసేవారు. మేనమామ డాక్టరు సుబ్రహ్మణ్యం విజయనగరంలో ఉండేవారు. అయన అక్కడి కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తూ వుండేవారు. ఆయన పిహెచ్‌.డి కూడా చేశారు. అంతేకాదు, సి.వి. రామన్‌ గారికి సహాధ్యాయి కూడా! పాఠశాల విద్య తరువాత మేనమామ దగ్గరుండి చదువుకోవటానికి రాజారావు విజయనగరం వచ్చారు. అక్కడ ఎస్‌ఎస్‌ఎల్సీ వరకు చదువుకున్నారు. అక్కడ జరిగే హరికథలకు హాజరవుతూ వుండేవారు. ఒకరోజు ఆదిభట్ల నారాయణదాసు గారి హరికథకు హాజరై, దాసు గారి పాటలకు, పద్యాలకు లయబద్ధంగా నర్తించారట! అది చూసి, గొప్ప కళాకారుడవుతావని దాసు గారు అన్నారట. విజయనగరంలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి పూర్తి చేశాక, సికింద్రాబాదు లాల్‌గూడా వర్కుషాపులో గుమస్తా ఉద్యోగంలో చేరారు రాజారావు. అదే సమయంలో నాగేశ్వరమ్మ గారితో వివాహం జరిగింది. ఆమెది విజయనగరం పరిసర ప్రాంతమే. 3, 4 సంవత్సరాలు ఆ వర్క్‌ షాపులో పనిచేశాక.. పై అధికారుల ఒత్తిళ్లు భరించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వతంత్రంగా పని చేసుకునే విద్యకోసం మదరాసు చేరుకుని, 22 ఏళ్ల వయసులో ఎల్‌ఐఎం అనే మెడికల్‌ కోర్సులో చేరారు. ఈ కోర్సు ఇప్పటి ఎంబిబిఎస్‌తో సమానమైనది. మద్రాసులో చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు రామచంద్రారెడ్డిగారితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఫలితంగానే ఆయన వామపక్ష భావాలవైపు తన నడక కొనసాగించాడు. మద్రాసులో అనేక నాటకాలను ప్రదర్శించారు. అందులో షాజహాన్‌ నాటకం పెద్ద సంచలనం సృష్టించింది. నటుడిగా, దర్శకుడిగా ఆయన పేరు మార్మోగిపోయింది. ప్రఖ్యాత రూపశిల్పి దేవీప్రసాద్‌ రారు కలకత్తానుంచి వచ్చి స్వయంగా రాజారావు గారికి మేకప్‌ చేయటం, దేశమంతా విశేషంగా చెప్పుకున్నారు.
డాక్టర్‌ రాజారావు నటుడు, రచయిత, ప్రయోక్త. ప్రజానాట్యమండలి నిర్వాహకుడిగా, ప్రధాన కార్యదర్శిగా విలువైన సేవలు అందించారు. సుంకర, వాసిరెడ్డి రచించిన 'మాభూమి' నాటకాన్ని కొన్ని వందలసార్లు ప్రదర్శించారు. 108 నాటక దళాలను ఏర్పాటు చేసి మా భూమి నాటక ప్రదర్శనలను గ్రామ గ్రామాన ప్రదర్శింపచేశారు. ప్రజానాట్యమండలిలో తనతో పాటు పనిచేసిన ఎంతోమంది కళాకారులకు తాను తీసిన పుట్టిల్లు సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అల్లు రామలింగయ్య, జమున మొదలైన ప్రజాకళాకారులు ఆ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. బుర్రకథ సామ్రాట్‌ షేక్‌ నాజర్‌ కూడా ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు. రాఘవ కళాసమితి నాటకసంస్థ ద్వారా నాటకాలు వేయటం మొదలుపెట్టినప్పుడు, ఆ కార్యక్రమాల్లో రాజారావు గారికి శిష్యుడుగా చాలా దగ్గరైన కళాకారుడు కాకరాల. ఆ నాటక కార్యక్రమాలు 1954 నుంచి 1959 వరకు కొనసాగాయి. నాటకానికి విపరీతంగా అంకితమైపోయారు రాజారావు. 1956-1957 ప్రాంతంలో నేరెళ్ళ వేణుమాధవ్‌ గారిని పిలిపించి అనేక ప్రదర్శనలు ఇప్పించారు. 1957లో ఢిల్లీలో జరిగిన ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోషియేషన్‌ ఉత్సవాలకు విజయనగరం నుంచి జాలరి నృత్యం చేసే సంపత్‌ కుమార్‌ గారిని, భరతనాట్య ప్రవీణుడు కోరాడ నరసింహారావు గారిని తనతోపాటు తీసుకెళ్లి, వాళ్ల ఖ్యాతిని దేశమంతా వ్యాపించేలా చేశారు.
వైద్యుడిగా కూడా రాజారావు సుప్రసిద్ధులు. ఆయన ఇంటిముందు రోగులు బారులు తీరి నిలబడేవారు. ఫీజు ఇవ్వలేని పేదలకు ఉచితంగా వైద్యం చేయటమే కాకుండా మందులు, పండ్లు తానే కొని వాళ్లను ఆదుకునేవాడు. ఒకానొక సమయంలో తన భార్యకు జబ్బుచేసి ఆమెకు ఆపరేషన్‌ జరుగుతోంది. ఇంతలో ఒక రిక్షావాడి భార్యకు ప్రాణం మీదికి వచ్చి విలవిల్లాడుతోంది. తన భార్య ఆపరేషన్‌ పనిని తన సహచర వైద్యుడికి అప్పజెప్పి, తాను వెళ్లి ఆ రిక్షావాడి భార్యను ప్రాణాప్రాయం నుంచి కాపాడాడు. రోగులను మాత్రమే కాదు తనతోపాటు నాటక ప్రదర్శనల్లో పాల్గొనే కళాకారులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురైనప్పుడు సహృదయంతో ఆదుకునేవాడు. నాటకం రిహార్సల్స్‌ జరిగే రోజుల్లో కళాకారులందరికీ తన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేసేవారు. ఒక్కోసారి కళాకారుల ప్రయాణానికి అవసరమైన టిక్కెట్లను కూడా తన డబ్బుతోనే సమకూర్చేవారు.
రాజారావు తన సినిమా పుట్టిల్లు ఆఖరి దశకు చేరుకుంది. మిగిలిన సినిమాను పూర్తి చేయటానికి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు మరణించారు. అప్పు గా తెచ్చిన డబ్బును సినిమాను పూర్తిచేయటానికి కాకుండా మరణించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి మీద ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి అన్ని సినిమా థియేటర్లలోనూ విడుదల చేయించారు ఆయన. ఇలా తన దేశభక్తిని ప్రదర్శించుకున్న సందర్భాలు ఆయన జీవితంలో కోకొల్లలు.
ఆయన నిర్వహించిన నాటకాల్లో మరో ముఖ్యమైన నాటకం 'జై భవాని'. ఇది గొప్ప దేశభక్తి నాటకం. దీనిని మరాఠీ నుంచి ఎవరో అనువదిస్తే దాన్ని రాజారావు ప్రదర్శించారు. ఈ నాటకాన్ని ప్రదర్శించటానికి రిహార్సల్స్‌ కూడా మొదలుపెట్టారు. అదే సమయంలో సినిమా అవకాశాలు రావటంతో చాలామంది కళాకారులు రాజారావు గారిని వదిలి వెళ్లిపోయారు. కాని ఒకే ఒక నటి ఆ నాటకాన్ని వదిలిపోకుండా అన్ని ప్రదర్శనల్లో పాల్గొంది. ఆమె ఎవరో కాదు; ప్రఖ్యాత సినినటి వాణిశ్రీ. ఈమెతో కలిసి జై భవాని నాటకాన్ని హైదరాబాదులో ప్రదర్శించినప్పుడు, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారిని ప్రదర్శనకు ఆహ్వానిస్తే, కార్యక్రమాల ఒత్త్తిడి వల్ల 15 నిమిషాలు మాత్రమే వుండగలనని చెప్పి, వచ్చిం తరువాత నాటకం పూర్తిగా అయిపోయేవరకు వుండి, కళాకారులందరిని ప్రశంసించి తిరిగి వెళ్లుతూ, ఈ నాటకాన్ని నేపాల్‌ సరిహద్దుల్లో సైనికుల సమక్షంలో ప్రదర్శించమని రాజారావు గారిని కోరారట.
అది 1963 సెస్టెంబరు 6వ తారీఖు, ఆ రోజు ఎవరో కేంద్రమంత్రి మదరాసు వచ్చి 'జై భవాని' నాటక ప్రదర్శన గురించి మాట్లాడదామని రాజారావు గారిని పిలిపించారు. రాజారావు, ఆయనతోపాటు కాకరాల, మరికొందరు మిత్రులు ఆ కేంద్రమంత్రి దగ్గరకు వెళ్లారు. కేంద్రమంత్రితో మాట్లాడుతున్నప్పుడే రాజారావుగారికి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం అందించాక రెండవ రోజు కొంచెం తేరుకున్నారు. హుషారుగా మాట్లాడటం మొదలుపెట్టారు. మూడవ రోజు అంటే 1963 సెప్టెంబరు 8వ తారీఖున వాళ్ల పెద్దాబ్బాయి పృధ్వీరాజ్‌ హైదరాబాదు నుంచి తన తండ్రి వుండే ఆసుపత్రి చేరుకున్నారు. రాజారావు గారు హార్లిక్స్‌ తాగుతూ ముగ్గురు కొడుకుల్ని చూశారు. తనకు బాగానే ఉందని, మీరు స్నానాలు చేసిరండని అందర్ని ఇంటికి పంపించారు. ఈలోగా ఆయన్ని చూడటానికి డాక్టర్‌ గాలి బాలసుందరరావు గారు వచ్చారు. వచ్చి రాజారావు గారికి పరీక్షలు చేస్తుండగానే మరోసారి రాజారావు గారికి గుండె పోటు వచ్చింది. డాక్టరు గారు ఛాతిమీద కొడుతూ ఊపిరిని పునరుద్ధరించటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అవి ఫలించలేదు. 1963 సెప్టెంబరు 8వ తారీఖున సాయంకాలం 4.45 గంటలకు ఆయన తుదిశ్వాస వదిలారు. ఆ విషాదవార్త విని తండోపతండాలుగా అభిమానులు తరలి వచ్చారు.
గరికపాటి రాజారావు భౌతికంగా దూరమైనా, ప్రజా కళారూపాల్లో ఆయన సజీవంగా కనపడుతూనే వుంటారు. ప్రజానాట్యమండలి కళాకారులు కాళ్లకు గజ్జలు కట్టుకున్నప్పుడు ఆ మువ్వలు చేసే శబ్దంలో ఆయన తొంగిచూస్తూనే వుంటాడు. వేదికల మీద జనంపాటలు హౌరెత్తినప్పుడు తాను చరణాలై కదం తొక్కుతూ వుంటాడు. రంగస్థలంమీద ఎప్పటికీ తెరపడని నాటకం డాక్టర్‌ గరికపాటి రాజారావు.
(సెప్టెంబరు 8 : గరికపాటి రాజారావు వర్థంతి)

- డా. కె.జి.వేణు
98480 70084