లక్నో : ఎండ వేడిని తట్టుకలేక గడచిన రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో 34 మంది మృతి చెందినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారందరూ 60 ఏళ్లు పైబడినవారేనని అధికారులు తెలిపారు. మృతులందరికీ గతంలోనే పలు అనారోగ్య సమస్యలున్నాయని, వీటివల్ల వేడిని తట్టుకోలేక వారంతా మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. దీంతో 60 ఏళ్లు పైబడిన నివాసితుల్ని పగటిపూట ఇంట్లోనే ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు ఆగేయంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లియా జిల్లాలో ఈ మరణాలు సంభవించాయి. గురువారం రోజు ఇరవై మూడు మంది మృతి చెందితే.. శుక్రవారం రోజు మరో 11 మంది మృత్యువాతపడ్డారని బల్లియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయంత్ కుమార్ తెలిపారు. శనివారం జయంత్ మీడియాతో మాట్లాడుతూ.. 'చనిపోయిన వారందరూ గతంలోనే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడతున్నారు. వీరంతా తీవ్రమైన వేడిని తట్టుకోలేక మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియా కారణంగానే మరణించారు.' అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మరో మెడికల్ ఆఫీసర్ దివాకర్ సింగ్ మాట్లాడుతూ.. 'వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బల్లియా ప్రధాన ఆసుపత్రికి తరలించాము. అయినప్పటికీ వారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు' అని ఆయన అన్నారు.
కాగా, భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు శుక్రవారం రోజు బల్లియాలో 42.2 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఇదిలా ఉంటే ఆ రాష్ట్రంలో విద్యుత్ కోతల వల్ల మంచినీరు లేక, ఫ్యాన్లు, ఎయిర్ కండీషన్లు లేక జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విద్యుత్ కోతలకు నిరసనగా పలువరు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యుత్ సరఫరాకు సంబంధించి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు.