
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :దోసపాడు దళితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న దళితులను అరెస్టు చేయడమే కాకుండా భూముల్లోకి వెళ్లబోమని రాసివ్వాలని పోలీసులు బెదిరించడంపై ఎస్‌సి కమిషన్‌కు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి శనివారం ఫిర్యాదు చేశారు. 144 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారని వివరించారు. దీనిపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. సొంత భూముల్లోకి వెళ్లి స్వాధీనం చేసుకుంటే పోలీసులు బెదిరించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
అరెస్టులను ఖండించిన వ్యవసాయ కార్మిక సంఘం
ఏలూరు జిల్లా దోసపాడులో చట్ట ప్రకారం సంక్రమించిన చెరువులను స్వాధీనం చేసుకుంటున్న దళితులను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుని దళిత యువకులను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. 24 ఎకరాలకు సంబంధించి లోకాయుక్త కోర్టు దళితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. భీమడోలు సిఐ దళితులను బెదిరించడం సరికాదని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు.