Nov 07,2023 10:43
  • ఇక్కడి దాకా పరిస్థితి రానీయొద్దు : సుప్రీం కోర్టు
  • గవర్నర్లు ప్రజలచే ఎన్నుకోబడినవారు కాదనే విషయం గుర్తెరిగితే మంచిది

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను నెలలు, కొన్ని సార్లు ఏళ్ల తరబడి నాన్చుతున్న గవర్నర్ల తీరుపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. ఈ విధమైన సంస్కృతికి ముగింపు పలకాలని కోరింది. గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడినవారు కాదనే విషయం గుర్తెరిగి వ్యవహరిస్తే మంచిదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మందలించింది. పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ నాన్చుడు వైఖరికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దీనిపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. బిల్లుల జాప్యం అంశం సుప్రీం కోర్టుకు రాకముందే గవర్నర్లు తగు నిర్ణయం తీసుకోవాలి. కోర్టుకు చేరాక చర్యలు తీసుకునే పద్ధతికి ముగింపు పలకాలి. తెలంగాణ విషయంలోనూ ఇలానే జరిగింది. పంజాబ్‌ గవర్నర్‌ చర్యలపై తాజా నివేదికను శుక్రవారానికల్లా సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. పంజా బ్‌ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఆర్థిక, విద్యా సంబంధిత చట్టాలతో సహా ఏడు బిల్లులను గత జులై నుంచి ఆమోదం తెలపకుండా తొక్కిపట్టారని అన్నారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుంచి ఇదే విధమైన పిటిషన్లు వచ్చాయి. శాసనసభ ఆమోదించి న బిల్లులకు ఆమోదం తెలపడంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఎడతెగని జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ కోర్టుకు విన్నవించారు. ''ఈ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత, 'మేమూ సుప్రీంకోర్టులో పోరాడుతాము' అని గవర్నర్‌ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి'' అని వేణుగోపాల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పంజాబ్‌ కేసుతోబాటే కేరళ, తమిళనాడు కేసులు కూడా శుక్రవారం విచారణకు చేపట్టాలని వేణుగోపాల్‌ అభ్యర్థించారు.దీనికి ధర్మాసనం అంగీకరించింది.