
ఆ పాప దీనంగా ఇంటి ముందుకు వచ్చి సహాయం అర్థించినప్పుడు- చాలామంది ఇళ్లల్లో సీరియల్‌లోని చిన్నారి కష్టాలకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండి ఉంటారు. ఆ పాపను రోడ్డు మీద చూస్తూ వెళ్లిపోయిన అనేకమంది మీడియాలో చూసిన ఇతరత్రా అన్యాయాలపై 'అయ్యో .. దారుణం' అని తల్లడిల్లిపోయి ఉంటారు. వర్చ్యువల్‌గా ఇంతింత కరుణ కురిపిస్తున్న జనం ... నిజంగానే అలాంటి ఘోరం కళ్లముందు జరిగినప్పుడు, జరుగు తున్నప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎందుకు 'అయ్యో' అని అడ్డు పడలేదు? లైంగిక దాడికి గురై రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో ఇల్లిల్లూ తిరిగినా - బాధిత బాలికకు ఆదరణ దొరకని స్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ?

సాటి మనిషికి ఆపద వస్తే సాయం చేసే చేతులు ఎన్ని ఉన్నా.. దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం ఆపటానికి ఎందుకు ముందుకు రావటం లేదు? అన్యాయం జరిగిందని, అత్యాచారం ఘోరమని ఆవేదన చెందే జనం - ఆ సంఘటన కళ్ల ముందు జరిగితే మాత్రం ఎందుకు స్పందించటం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఈ పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? వేగంగా సాగిపోయే జీవనం, సమయం మధ్య, వస్తువుల మధ్య, యంత్రాల మధ్య హడివిడిగా పరుగులు తీసే జీవనం ... మానవ సహజ ప్రవృత్తిని, మానవీయ స్పందనని ఎందుకు కోల్పోతోంది? ఆలోచించాల్సిన విషయం ఇది.
మనిషిలో మానవత్వం మంటగలిసిందా! లేదని, కాదని ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందే ఉన్నాయి. మొన్న బాలాసోర్ రైలు ప్రమాదంలో అధికార యంత్రాంగం కంటే ముందే స్థానికులే కదలి ఆపన్నులను ఆదుకున్నారు. రోడ్డు మీద ప్రమాదాలు జరిగితే ఫొటోలు తీసేవారు కనిపిస్తున్నా, ఎవరో ఒకరు వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తారు. జల ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నా, వరదల్లో చిక్కుకున్నా, ఎక్కడ ప్రమాదం జరిగినా బాధితులకు అండగా ఎంతోమంది కదిలివస్తారు. అయితే అవి ప్రమాదాలు.. అదే అల్లర్లు, లూటీలు, హత్యలు, అత్యాచారాలు కళ్ల ముందు జరుగుతున్నప్పుడు మాత్రం బాధితులకు అండగా నిలబడిన సంఘటనలు సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తక్కువ.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరుగాంచిన ఉజ్జయిని నగరంలో అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక కాళ్ల వెంట రక్తం కారుతూ అత్యంత దీనస్థితిలో రోడ్డు వెంట నడుస్తూ, 'నేను ఆపదలో ఉన్నాను. నా వెంట ఎవరో వస్తున్నారు. రక్షించండి' అని ఇంటింటికీ తిరిగి అర్థించింది. ఒంటిమీద సరైన ఆచ్ఛాదన లేని ఆ బాలిక గౌరవాన్ని కాపాడే ఒక్కటంటే ఒక్క గుడ్డ పీలిక కూడా ఇవ్వలేదు ఎవరూ. ఆ పాప భాష అర్థం కాకపోయినా ముఖంలోని బాధ అయితే అర్థమవుతుంది కదా! తన స్థితిని చూస్తే, ఆపదలో ఉన్నదని కచ్చితంగా అర్థమవుతుంది కదా! జనం కళ్లతో చూశారు కానీ, మనసుతో ఆలోచించలేదు! భయంభయంగా తడబడుతూ అర్థిస్తూ నడుస్తున్న ఆ బాలికకు సాయంగా కొంతమంది రూ.50, రూ.100 ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 'ఆ స్థితిలో ఉన్న పాపకు డబ్బులు ఎంతవరకు అవసరం? ఆమెకు ఇవ్వాల్సిన తక్షణ సాయం ఏంటి?' అనే స్పృహ చూసిన వారిలో లేకపోయింది.
ఇలా మానవీయ స్పందన లేని సంఘటన ఇదొక్కటే కాదు. ఈ ఏడాదే మే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా కత్తితో దాడి చేశాడు ఓ దుర్మార్గుడు. పదే పదే ఆమె శరీరంపై కత్తి పోట్లు పొడిచాడు. ఇంతటి పాశవిక దాడి జరుగుతున్నప్పుడు ఆ పక్కనుంచే కొంతమంది అటూ ఇటూ నడుచుకుంటూ వెళ్లారు. ఆ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. కనీసం గట్టిగా అరవలేదు. సిసిటివి కెమెరాలో ఈ దృశ్యాలు చూసిన వారంతా కనీస స్పందన లేని అక్కడి జనాన్ని చూసి నివ్వెరపోయారు.
ఈనెల 15వ తారీఖున ఉత్తరప్రదేశ్‌లో 11వ తరగతి చదువుతున్న బాలికను ఇద్దరు యువకులు వెంటాడి వేధించారు. మోటారు బైక్‌పై వచ్చి స్కూలు నుంచి ఇంటికి సైకిల్‌పై వెళ్తున్న ఆమె చున్నీని పట్టుకుని గట్టిగా లాగారు. ఆ పాప అదుపుతప్పి వెనుక నుంచి వచ్చిన మరో మోటారు సైకిలు కింద పడి మృతి చెందింది. అది స్కూలు విడిచిన సమయం. ఆ రహదారంతా జనసందోహంగా ఉంది. అయినా ఆ యువకులను నిలువరించే సాహసం ఎవ్వరూ చేయలేదు.
.... ఇలా బస్సుల్లో, రైళ్లల్లో, నడిరోడ్డు మీద మహిళలు, పిల్లలపై ఎన్నో దారుణాలు కళ్ల ముందే జరుగుతున్నాయి. వేరే కులం వాడ్ని పెళ్లి చేసుకుందని, కూతురు ముందే, జనం మధ్యే ఆమె భర్తను నరికేసిన ఘటనలు జరుగుతున్నాయి. కళ్ల ముందు జరిగే నేరాన్ని ఆపేందుకు, నేరస్తులను నిలువరించేందుకు ఎవరూ కనీస ప్రయత్నం చేయటం లేదు. 'ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు సామాజిక స్పృహ లేనివారు, తమకేం అవుతుందేమోనని భయపడేవారు కనీస స్పందన లేకుండా ఉంటార'ని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
దాడికి గురైన బాధితుల పట్ల కొండంత సానుభూతి చూపించక్కర్లేదు. కొవ్వొత్తుల ర్యాలీలు చేయక్కర్లేదు. కళ్లముందు దాడి జరుగుతున్నప్పుడు, ప్రమాదంలో ఒకరు చిక్కుకొని ఉన్నప్పుడు - ఆపటానికి ఒక్క ప్రయత్నం చేస్తే చాలు. ఇటీవల కేరళలో జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు తప్పక చెప్పుకోవాలి. తన ఇంటి ముందు నిర్మానుష్య ప్రాంతం నుంచి వస్తున్న ఓ బాలిక ఏడుపు విన్న ఆ ఇంటి యజమాని, క్షణం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లాడు. ఆ అలికిడికి అప్పుడే బాలికపై దాడికి తెగబడుతున్న ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అతడు వారిని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ బాలికకు ఆసరాగా నిలిచాడు. ఇటువంటి స్పృహ, సత్వర స్పందన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. నేరం జరిగాక బాధపడేకంటే కళ్ల ముందు నేరం జరుగుతుంటే ఆపే కనీస ప్రయత్నం చేయాలి. ఒక్కరు ఒక్క అడుగు ముందుకు వేస్తే మరికొందరు వెంట నడుస్తారు. బాధితులకు అండగా నిలుస్తారు. అలాంటి మానవీయ స్పందనను మనమెప్పుడూ కోల్పోరాదు.
ఒక్కోసారి పెద్ద కేక గొప్ప రక్షణ సాధనం అవుతుంది.
ఒక్కోసారి చిన్న ఓదార్పు పెద్ద భరోసా అవుతుంది.
చోద్యం చూడడం మానేద్దాం. అవసరమైప్పుడు, అవకాశం ఉన్నంత మేర స్పందిద్దాం.