Jun 12,2023 08:08

తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని వారితో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాంతో పిల్లల్లో మొండితనం ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు. అలా చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేస్తున్నారు. ఎంత చెప్పినా అల్లరి మానరు, క్రమశిక్షణ పాటించరు అంటూ వారిని నిత్యం తిట్టకూడదు. నేర్పుగా చెప్పి మార్చుకోవాల్సిందే అంటున్నారు.

  • కొంతమంది పిల్లలు హైపర్‌ యాక్టివ్‌గా ఉండి, అల్లరి బాగా చేస్తారు. వారిని తట్టుకోవడం తల్లిదండ్రులకు కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పుడు పిల్లల్ని శారీరకంగా దండిస్తేనే మాట వింటారని అనుకుంటారు చాలామంది. కానీ వారిని అలా దండించటం వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రత్యేకంగా చిన్న పిల్లల్లో ఎన్నో మానసిక సమస్యలు వస్తాయి. వారి మానసిక ఎదుగుదల పైనే కాక వారి ఆహారపు అలవాట్లు కూడా ప్రభావితమవుతాయి.
  • పిల్లల్ని శారీరకంగా దండించినప్పుడు వారిలో కోపం, అసహనం, నిరాశ లాంటి మానసిక భావోద్వేగాలు కలగాపులగంగా మారతాయి. దాంతో మొండితనం ఎక్కువ అవుతుంది. చిన్నదానికి కూడా పేచీలు పెడతారు.
  • పిల్లల్ని కొట్టినప్పుడు వారు చేసిన తప్పే మళ్లీ చేసి పెద్దవాళ్లకు మరింత కోపం తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది వారిలో ఒకరకమైన అసహనం. ఎదురు తిరిగే మనస్తత్వం ఏర్పడుతుంది.
  • కొట్టినప్పుడు కొంతమంది పిల్లలు శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. అది వారిలో అతి భయానికి దారి తీస్తుంది. దండించిన వ్యక్తులకు దూరంగా ఉండేందుకు చూస్తారు. ఇది వారి ఆలోచనా ధోరణిపై, పని తీరుపై తీవ్ర ప్రభా వం చూపిస్తోందని వైద్యులు అంటున్నారు.
  • శారీరక పరమైన శిక్ష వల్ల పిల్లలు తమ పట్ల తామే నమ్మకం కోల్పోతారు. తాము ఏ పని సక్రమంగా చేయలేము, ఎందుకూ పనికి రానివారం అనే భావనలోకి వెళ్ళిపోతారు. అందుకే కొట్టకుండా ఏ విషయానైన్నా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తుండాలి.
  • మరి పిల్లల్ని కొట్టకుండా ఎలా పెంచుతాము అనే వాదన చేస్తుంటారు చాలామంది. చిన్న పిల్లలకి తప్పు ఒప్పు ఎలా తెలుస్తాయి? పెద్దలు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, వీరి అందరి మార్గ దర్శకత్వమే కదా, వారి ప్రవర్తనకి దిశా నిర్దేశం చేయాలి.

సానుకూలంగా : పిల్లలు మంచి మార్గంలో నడవాలనే తమ తల్లి తండ్రులు తపన పడతారు. అలాంటప్పుడు వారితో ప్రేమతో మాట్లాడాలి. అల్లరి చేస్తున్నప్పుడు నిదానంగా, ఓర్పుగా చెప్పాలి. అప్పుడు వారి ప్రవర్తనలో కొంత మార్పు వస్తుంది. అంతేగానీ ఒక్కసారిగా అల్లరి తగ్గించరు. అసలు పిల్లలు అల్లరి చేస్తారు, చేయాలి అన్న ఆలోచన పెద్దల్లో ఉండాలి. పిల్లలకు ఎలా మాట్లాడాలో నేర్పించాలి. అమ్మానాన్నల మాట తీరు కూడా పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి.

  • పిల్లలు చేసే చిన్న చిన్న పనులను మెచ్చుకుంటే వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. దాంతో నిదానంగా మెండితనం తగ్గిస్తారు. అప్పుడప్పుడు చిన్న చిన్న కానుకలు ఇవ్వటం ద్వారా వారు చేసిన మంచి పనులు ఏంటి? తప్పులు ఏంటి? గ్రహించగలుగుతారు. దాంతో ఏది చేయకూడదో తెలుసుకుంటారు.
  • ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని ఆలోచన చేస్తున్నారు ఎక్కువమంది. కానీ వారితో సమయం కూడా కేటాయించాలి. పిల్లలతో మంచి చెడులు మాట్లాడటం, వారితో చిన్న చిన్న పనులు చేయించటం వల్ల వారు మీకు మానసికంగా దగ్గర అయ్యి వారి మనసులోని భావాలను పంచుకుంటారు.
  • పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే మంచి ఆహారం చాలా ముఖ్యం. పోషకాలతో కూడిన ఆహారం ఇస్తూ ఉండాలి. సరైన వ్యాయామాలతో పాటు విహారయాత్రల కు తీసుకెళ్లాలి. కొత్త ప్రదేశాలను చూసినప్పుడు వారిలోఉత్సాహం రెట్టింపవుతుంది. పెద్దల పట్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.