తండ్రీ సూర్యనారాయణ మూర్తీ
ఆ గోరకలి సూడ్డానికే తూరతన్నావా ?
అమ్మా, భూదేవతా
ఇంత అంతకానికొడిగడితే నీ గుండె బద్దలవ్వలేదా ?
ఆ దగుడుబాజి దారవాతల్ని దమటైమండి
బుగ్గిసెయ్యప్పోతే నిన్నగ్గిదేముడని ఎందుకు మొక్కాల ?
రాళ్ళవరసం కురిపించి ఆ రాకాసుల్ని రయిం సెయ్యకపోతే
వానదేముడా అని నీకేల పూజ్జెయ్యాల ?
గాడుపై రానేకపోనావా గాలిదేముడా
ఆ గండల్ని యీడ్సికెలిపోనేకపోనావా ?
రత్తం మరిగిపోతంది!
కడుపుడికిపోతంది!
ఇలమీదెప్పుడైనా ఇలపింటిదుందా?
ఒక నాయం నేదా? ఒక దరమ్ము నేదా?
ఆళ్ళు మీ తోడబుట్టినోళు కాదా
ఆళ్ళది మీ రత్తసొర్శి కాదా?
మీ ఇంట్ల ఆడోళు నేరా?
ఆళు మీ ఆడోళ్ళాటోలు కారా?
సందిరిడు సాతీ వుంతే సరా
సోకులు సేసుకోని అన్నంటన్నంట తిరిగొత్తే అదే పాలనా?
ఇంత నరుకూతలోళేట్రా మీరు
ఇంత నరకాసురులేట్రా మీరు
పశివిలు సేనిమేసీకుంట ఎలుగని నమ్ముకుంతే
మీరే పశువుల్లాగ పొలాన పడి తగడకుమ్మెత్తారా?
సంరచ్చన సెయ్యమంతే సిగుర్లు సిక్కెత్తారా?
మారాజా అని మనివిసేత్తే మర్రొండు తన్నమంతారా?
బాగుంది నాయినా మీ తిత్తవ
మా గొప్పగుంది నాయినా మీ పరిపాలన తీరవ
సన్నాసుల్లారా ..సాగిపోతందని సంబరపడిపోకండి
ఎర్రిపువ్వుల్లారా.. ఎలిగిపోతన్నామని ఇరగబడిపోకండి
ఉట్టిగట్టుకోని మీరిలగే వుగమ్మీద వుండిపోరు
బాబక్కరంతోటి ఎల్లకాలం బతికీలేరు
ఎద్దెప్పుడూ ఒకపక్కే తొంగోదు
పొద్దెప్పుడూ పడమర దిక్కునే ఉండిపోదు
మీరూ ఏడుకట్లు సవ్వారి ఎక్కక తప్పదు
మీ దిబ్బల మీదా దివ్వలెట్టే రోజులు రాకమానవు
ఒకరోజు ఎనకాముందూ.. ఇంతే!
ఈరోజు ఇందమ్మా అంతే రేపు అందమ్మ .. ఔనంతే !
మీ బతుకూ తెల్లారిపోద్ది.. గాబరపడొద్దు
పొడుసుకొత్తాది సూసుకోండి రేపు 'ఎర్రటిపొద్దు'
- లాంగుల్య










