Aug 03,2023 09:01
  •  వినుకొండ సభలో సిఎం జగన్‌పై లోకేష్‌ విసుర్లు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇసుక మాఫియా నుంచి సిఎం జగన్‌కు రోజుకు రూ.3 కోట్లు అందుతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. నదుల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టడం వల్ల ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. యువగళం పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర పల్నాడు జిల్లా నూజెండ్ల, వినుకొండ మండలాల్లో సాగింది. వినుకొండ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. గత నాలుగేళ్లలో మద్య నిషేధం ఘోరంగా విఫలమైందని, ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని మహిళలను ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. టిడిపి హయాంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్‌ ఇసుక జగన్‌ పాలనలో రూ.5 వేలు పలుకుతోందన్నారు27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని విమర్శించారు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేరు కబ్జాల రాయుడుగా ఆయన అభివర్ణించారు. పలు చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వినుకొండలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకి ''బీ ట్యాక్స్‌' చెల్లించాల్సిందేనని విమర్శించారు. కబ్జాల రాయుడు భూకబ్జాలపై ప్రత్యేక సిట్‌ వేస్తామని, భూములు అన్ని వెనక్కి తీసుకోని పేదలకు పంచుతామని తెలిపారు. టిడిపి నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్లు వినుకొండలో ఉన్నా... విదేశాల్లో ఉన్నా.. పట్టుకొచ్చి లోపలేస్తానని హెచ్చరించారు.