
- ఇపిడిసిఎల్ పిటిషన్‌ను తిరస్కరించాలి
- ఎపిఇఆర్‌సి విచారణలో విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపొద్దని విద్యుత్ రంగ నిపుణులు ఎం వేణుగోపాల్‌రావు కోరారు. ఇప్పటికే డిస్కమ్‌లు అనేక భారాలను వినియోగదారులపై వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల వర్కింగ్ క్యాపిటల్ పేరుతో వినియోగదారుల నుంచి రూ.650 కోట్ల వడ్డీ వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)లో పిటిషన్ వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ఇఆర్‌సి కార్యాలయంలో ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విచారణ జరిగింది. వేణుగోపాల్‌రావు అభ్యంతరాలపై డిస్కం ఇచ్చిన సమాధానంపై ఆయన మాట్లాడారు. విద్యుత్ కొనుగోళ్లలో వర్కింగ్ క్యాపిటల్ వడ్డీ పేరుతో సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల భారం ప్రజలపై డిస్కమ్‌లు మోపుతున్నాయని అన్నారు. కేవలం ఇపిడిసిఎల్ రూ.650 కోట్లు ప్రతిపాదించిందని, ఇంకా ఎస్‌పిడిసిఎల్, సిపిడిసిఎల్ కూడా ప్రతిపాదించే అవకాశం ఉందని అన్నారు. వినియోగదారులు బిల్లు చెల్లించడం ఆలస్యమైతే డిస్కమ్‌లు వడ్డీ వసూలు చేస్తున్నాయని, కనెక్షన్ మరలా ఇచ్చినా ఫీజులు వసూలు చేస్తున్నాయని వివరించారు. బిల్లులు 90 శాతం సకాలంలో వసూలవుతున్నాయని డిస్కమ్‌లే చెబుతున్నాయని మరి వడ్డీ ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయకలేపోవడంలో డిస్కమ్‌లు వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. 2018-19 నుంచి 2021-2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,650 కోట్ల టారీఫ్ సబ్సిడీ, ప్రభుత్వం, స్థానిక సంస్థల నుంచి రూ.3,563.58 కోట్ల బకాయిలు ఇపిడిసిఎల్‌కు పేరుకుపోయాయని చెప్పారు. చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. డిస్కమ్‌లు, ప్రభుత్వ వైఫల్యాలను వినియోగదారులపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను ఇఆర్‌సి అనుమతినిస్తే డిస్కమ్‌ల వైఫల్యం, అసమర్ధతను ప్రోత్సహించినట్లే అని చెప్పారు. కమిషన్ అనుమతి ఇచ్చిన దానికంటే విద్యుత్ తక్కువ కొనుగోళ్లు డిస్కం చేసిందన్నారు. అలాంటప్పుడు మరలా విద్యుత్ కొనుగోలుపై వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోతే డిస్కమ్‌లు ఎలా నడుస్తాయని పారిశ్రామిక వేత్త విజరుగోపాల్ రెడ్డి అన్నారు. వడ్డీ వసూలు కోసం ఇపిడిసిఎల్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు కూడా ఇఆర్‌సికి లేఖ రాశారు.