
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హిందూజా కంపెనీకి డిస్కంలు చెల్లిస్తున్న అక్రమ చెల్లింపులు ఆపాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్‌సి) కార్యదర్శికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు గురువారం లేఖ రాశారు. హిందూజా పిపిఎపై కమిషన్ గతేడాది ఆగస్టు 1వ తేదిన ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు డిస్కంలు భారీమొత్తంలో చెల్లించిన వ్యవహరంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023-24 ఏడాదికి డిస్కంలు ప్రతిపాదించిన ఎఆర్‌ఆర్ చార్జీలపై బహిరంగ విచారణలో తాము ఈ అంశాలను లేవనెత్తామని గుర్తుచేశారు. కమిషన్ పరిధిలో ఉన్న ఈ అంశంపై నేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఉత్తర్వులకు విరుద్దంగా డిస్కంలు హిందూజాకు చెల్లింపులు చేసిన్నట్లు తేలితే ఎఫ్‌పిపిఎఎ క్లెయిమ్‌లలో చెల్లింపులను అనుమతించబోమని కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొందని తెలిపారు. విద్యుత్ చట్టాం2003 ప్రకారం డిస్కంలు విద్యుత్ కొనుగోలు సేకరణ ప్రక్రియ కమిషన్ నియంత్రణ పరిధిలో ఉందని, అందులో భాగంగా విద్యుత్ కొనుగోలు చెల్లింపులు అంశం కూడా కమిషన్ నియంత్రణ పరిధిలో ఉందన్నారు. 2023 ఫిబ్రవరి 16న ఇంధన శాఖ జివో 19లో హిందూజా సంస్థకు రూ.1236కోట్లు అదనపు మొత్తాన్ని చెల్లించాలని పేర్కొందని తెలిపారు. ఈ నెల 3వ తేదిన జరిగిన విచారణలో జివో కాపీని కమిషన్‌కు అందజేస్తే చెల్లింపులపై స్పష్టత లేదని చైర్మన్ నాగార్జున రెడ్డి పేర్కొన్నారని వివరించారు. చెల్లింపులు ఎందుకు చేశారో డిస్కంల న్యాయవాది వివరించాలని విద్యుత్ రంగ నిపుణులు ఎం వేణుగోపాల రావు లేవనెత్తారని పేర్కొన్నారు. డిమ్‌డ్ జనరేషన్‌కు స్థిర చార్జీలను డిస్కంలు హిందూజాకు చెల్లిస్తున్నాయని డిస్కంల న్యాయవాది పి శివరాం చెప్పారని వివరించారు. వేణుగోపాలరావు అభ్యంతరాలపై హిందూజా సంస్థ న్యాయవాది సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధంగా హిందూజాకు చెల్లింపులు చేయడంపై తాము అభ్యంతరాలు లేవనెత్తామని గుర్తుచేశారు. డిమ్‌డ్ జనరేషన్‌కు స్థిర చార్జీలు చెల్లింపు అంశంపై కమిషన్, ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులలో విచారణ సందర్భంగా హిందూజా ఏనాడూ లేవనెత్తలేదని పేర్కొన్నారు. గత ఆగస్టు 1వ తేదీ ముందుకు కాలానికి డిమ్‌డ్ జనరేషన్‌కు హిందూజా ప్రాజెక్టుకు డిస్కంలు స్థిర చార్జీలు చెల్లించాలని కమిషన్, ఎపిటెల్, సుప్రీంకోర్టు ఆదేశించలేదని స్పష్టం చేశారు. తమ అభ్యంతరాలపై ఇఆర్‌సి స్పందించి హిందూజా చెల్లింపులను అడ్డుకోవాలని కోరారు.