
- తెలియకుండానే ట్రూఅప్ బాదుడు
- పెట్రోల్ ధరల మాదిరే కరెంట్ ఛార్జీలు పెంపు
- డిస్కమ్‌లకు ఎపిఇఆర్‌సి అనుమతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మూలిగే నక్కపై తాటిపండుపడ్డ చందంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల పరిస్థితి తయారైంది. ఇప్పటికే శ్లాబులు మార్పు, ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపు, ట్రూఅప్ భారాలతో ప్రజలపై డిస్కమ్‌లు వేల కోట్ల రూపాయల భారాలను మోపాయి. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు కొత్తగా ప్రతి నెల ట్రూఅప్ ఛార్జీలు బాదుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) బుధవారం ఉత్తర్వులను విడుదల చేసింది. డిసెంబర్ 29వ తేదీన కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన గెజిట్ ఆధారంగా ఎపిఇఆర్‌సి ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇఆర్‌సి కార్యదర్శి కె.రాజబాపయ్య ఈ గెజిట్‌ను విడుదల చేశారు. ప్రతి నెల విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇక నుండి నెలనెలా భారాలు పెరగనున్నాయి. ప్రతి నెలా విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు డిస్కమ్‌లకు అనుమతి వచ్చింది. దీంతో ప్రతిరోజూ పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతాయో, విద్యుత్ ఛార్జీలూ ప్రతి నెలా పెరగనున్నాయి. గతంలో ఏడాదికొక్కసారి ట్రూఅప్ విధానం ఉండేది. దీనిపైనా ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణ జరిపి అందరి అభిప్రాయాలూ తీసుకునేది. ఏడాది విధానాన్ని డిస్కమ్‌లు మూడు నెలలకు తీసుకొచ్చాయి. కేంద్రం గెజిట్‌కు అనుగుణంగా ఫిబ్రవరి 10వ తేదీన ఈ విధానంపై అభ్యంతరాలు, సలహాలు కోరుతూ ముసాయిదాను ఇఆర్‌సి విడుదల చేసింది. సిపిఎంతో పాటు పలు ప్రజాసంఘాలు, విద్యుత్ నిపుణులు కొత్త ట్రూఅప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇఆర్‌సి పట్టించుకోలేదు. అన్ని కేటగిరీలకు యూనిట్‌కు 40 పైసలు చొప్పున వసూలు చేసుకునే ప్రతిపాదనకు అనుమతిచ్చింది. ఏప్రిల్ ఒకటోతేదీ నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి నెలా వసూళ్లతోపాటు ఏడాది చివరలో ఇంధన సర్దుబాటు ఛార్జీకి మించి ఉంటే అదనంగా వసూలు చేసుకునే అవకాశం డిస్కమ్‌లకు కల్పించింది. అంటే ప్రతి నెల ట్రూఅప్‌తో పాటు మరలా ఏడాది చివరిలో మరో ట్రూఅప్ భారం ప్రజలపై మోపే అధికారం డిస్కంలకు ఉంటుంది. వీటిపై బహిరంగ విచారణ జరపాలన్న నిబంధన కూడా లేదు. డిస్కమ్‌లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రూఅప్ ధరల షాక్‌లను ప్రజలకు ఇవ్వొచ్చు. బొగ్గు ధరలు, విద్యుత్ కొనుగోలు ధర, ట్రాన్స్‌మిషన్ ధరలు పెరిగిన ప్రతిసారీ వీటిని వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే రూ.2910 కోట్ల ట్రూఅప్ భారాన్ని గతేడాది ఆగస్టు నుంచి డిస్కమ్‌లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇది 2024 జనవరి వరకూ ఉంటుంది. మరో రూ.3,083 కోట్ల ట్రూఅప్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ వసూలు చేస్తారు. అంటే ఇప్పటికే ట్రూఅప్ పేరుతోనే రూ.5,993 కోట్లను ప్రజల నుంచి డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి. ఈ విధానంపై అభ్యంతరాలు, సలహాలు కోరుతూ ముసాయిదాను ఇఆర్‌సి విడుదల చేసింది. సిపిఎంతో పాటు పలు ప్రజాసంఘాలు, విద్యుత్ నిపుణులు కొత్త ట్రూఅప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇఆర్‌సి పట్టించుకోలేదు. అన్ని కేటగిరీలకు యూనిట్‌కు 40 పైసలు చొప్పున వసూలు చేసుకునే ప్రతిపాదనకు అనుమతిచ్చింది. ఏప్రిల్ ఒకటోతేదీ నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి నెలా వసూళ్లతోపాటు ఏడాది చివరలో ఇంధన సర్దుబాటు ఛార్జీకి మించి ఉంటే అదనంగా వసూలు చేసుకునే అవకాశం డిస్కమ్‌లకు కల్పించింది. అంటే ప్రతి నెల ట్రూఅప్‌తో పాటు మరలా ఏడాది చివరిలో మరో ట్రూఅప్ భారం ప్రజలపై మోపే అధికారం డిస్కంలకు ఉంటుంది. వీటిపై బహిరంగ విచారణ జరపాలన్న నిబంధన కూడా లేదు. డిస్కమ్‌లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రూఅప్ ధరల షాక్‌లను ప్రజలకు ఇవ్వొచ్చు. బొగ్గు ధరలు, విద్యుత్ కొనుగోలు ధర, ట్రాన్స్‌మిషన్ ధరలు పెరిగిన ప్రతిసారీ వీటిని వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే రూ.2910 కోట్ల ట్రూఅప్ భారాన్ని గతేడాది ఆగస్టు నుంచి డిస్కమ్‌లు ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇది 2024 జనవరి వరకూ ఉంటుంది. మరో రూ.3,083 కోట్ల ట్రూఅప్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ వసూలు చేస్తారు. అంటే ఇప్పటికే ట్రూఅప్ పేరుతోనే రూ.5,993 కోట్లను ప్రజల నుంచి డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి.
భారాలు ఉపసంహరించుకోవాలి : సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఒకవైపు నోటిఫికేషన్ జారీ చేస్తూ, మరోవైపు సర్దుబాటు ఛార్జీల పేరుతో దొడ్డిదారిన భారాలు వేయడం మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ప్రకటన విడుదల చేశారు. 2023 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతినెలా విద్యుత్ యూనిట్‌కు 40 పైసలు చొప్పున అదనంగా సర్దుబాటు ఛార్జీలు (ట్రూఅప్) వసూలు చేయడాన్ని వ్యతిరేకించారు. దీంతోపాటు సంవత్సరాంతంలో అవసరమైతే అదనంగా సర్దుబాటు భారం మోపే ప్రమాదమూ ఉందని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.1400 కోట్లు విద్యుత్ ఛార్జీలు భారం మోపిందని, 2014-19 మధ్య వినియోగించుకున్న విద్యుత్‌కు ఇప్పుడు 36 నెలలపాటు యూనిట్‌కు 25 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రూ.2,900 కోట్ల భారం పడిందని వివరించారు. 2020-21లో వినియోగించుకున్న విద్యుత్‌పై యూనిట్‌కు 65 పైసలు వరకు 2023 ఏప్రిల్ నుంచి అదనంగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని, ఈ పేరుతో రూ.3,083 కోట్ల భారం వినియోగదారులపై పడనుందని తెలిపారు. మళ్లీ స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ వ్యయాన్నీ నెలవారీ ప్రజలపై వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాసరావు విమర్శించారు. బడా కార్పొరేట్ కంపెనీల నుంచి విద్యుత్ అధిక రేట్లకు కొనుగోలు చేస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ తదితర కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే రీతిలో బొగ్గు అధిక రేట్లకు కొనుగోలు చేసి సర్దుబాటు ఛార్జీల పేరుతో దండుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి నాయకులు, మాట తప్పి ఈ రీతిలో భారాలు మోపడం అన్యాయమని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను ప్రతినెలా వేసే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.