Mar 22,2023 16:25

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. వరుసగా రెండోరోజూ మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య ట్రేడింగ్‌ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అయితే బుధవారం రాత్రి వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లోకి దిగజారాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 58,074.68 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,418.78- 58,063.50 మధ్య కదలాడింది. చివరకు 139.91 పాయింట్ల లాభంతో 58,214.59 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,177.45 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,207.25- 17,107.85 మధ్య ట్రేడైంది. చివరకు 44.40 పాయింట్లు లాభపడి 17,151.90 దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో జబాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ నష్టపోయాయి.