May 16,2023 08:51

వేసవిలో మెడ రంగు మారిపోవడం చూస్తుంటాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల, శరీరంలో ఐరన్‌ తగ్గడం వల్ల మెడ నల్లగా మారుతుంది. స్థూలకాయం పెరగడం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, జన్యుపరమైన కారణాలు, పీసీఓడీ సమస్య, పెర్ఫ్యూమ్‌ ఎక్కువగా వాడడం వల్ల అలర్జీలు, డయాబెటిస్‌, హైపో థైరాయిడిజం వల్ల కూడా మెడ నల్లబడుతూ ఉంటుంది. వేసవిలో వచ్చే ఈ సమస్యను ఇలా నివారించుకోవచ్చు.
ొ వేసవిలో మెడ నలుపును పోగొట్టుకోవాలంటే మెడపై స్కార్ఫ్‌తో కప్పుకోవాలి.

  • ఒక గిన్నెలో టూత్‌పేస్ట్‌ తీసుకొని దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మెడలోని నల్లటి భాగంలో బాగా రాయాలి. 10 నిమిషాల పాటు అప్లై చేసుకుని, ఆపై శుభ్రమైన నీటితో మెడను కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా అప్లై చేయడం వల్ల మెడ ముదురు రంగు పోతుంది.
  • ఒక చెంచా శనగపిండిని తీసుకుని, దానికి చిటికెడు పసుపు వేసి, ఒక చెంచా పెరుగు వేసి బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తర్వాత, టవల్‌ లేదా మెత్తటి వస్త్రంతో మెడను శుభ్రంగా తుడవాలి. ఈ పేస్ట్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల చర్మం రంగు మెరుగవుతుంది.
  • యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలతో కూడిన కలబంద జెల్‌ను మెడకు పట్టించి కొంతసేపు మసాజ్‌ చేయాలి. ఈ జెల్‌ను రాత్రి పూట రాసుకుంటే మంచిది. రాత్రంతా మెడపై జెల్‌ వదిలి ఉదయం కడగాలి.