
పిల్లలూ, తత్వవేత్త, సిద్ధాంత కర్త, ఖగోళ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గురించి తెలుసుకుందామా ! సర్ ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండ్‌లో ఊల్స్ తోర్ప్‌లో లింకన్ షైర్ అనే ఊళ్లో 1642 డిసెంబర్ 25న జన్మించారు. నెలలు నిండక మునుపే పుట్టడంతో చాలా తక్కువ బరువుగా ఉండేవారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. దాంతో న్యూటన్ బాల్యం అమ్మమ్మ, తాతయ్యల దగ్గర గడిచింది. బలహీనమైన ఆరోగ్యం వల్ల తోటి పిల్లలతో ఆడేవాడు కాదు. ఒంటరిగా ఆలోచిస్తూ ఉండేవాడు. 12 ఏళ్ల వయసులో గ్రామర్ స్కూల్లో ఉన్నప్పుడు తన మేధోశక్తితో తోటి పిల్లల్ని ఆకట్టుకున్నాడు. భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు.
న్యూటన్ తరువాత ట్రినిటీ కాలేజీలో చదివాడు. ఏ పనిచేస్తూన్నా.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా మునిగిపోయేవాడు. గణిత శాస్త్ర సమస్యల పరిష్కారం కనుగొంటూ తీవ్రంగా ఆలోచించేవాడు. గణితంలో న్యూటన్ ఆసక్తి చూసిన ఓ ఉపాధ్యాయుడు ఆయన్ని పై చదువుకు పంపాడు. దాంతో న్యూటన్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్ధ్యంతో తోటి విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నాడు. రోజులో 18 గంటలు చదువుతూ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి, త్రికోణమితిల ఎంచుకున్నాడు.
తరచుగా కెప్లర్, ఇతరులు రాసిన, తయారుచేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవాడు. కాంతి, రంగు మీద పరిశోధనలు చేశాడు. అవన్నీ ఒక పుస్తకంగా ప్రచురించాడు. దాంతో కేంబ్రిడ్జిలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా నియమించబడ్డారు.
న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితంపై తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు కనుగొన్నారు. ప్రత్యక్ష, విలోమ పద్ధతులు ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. తర్వాత కాంతి మీద అనేక ప్రయోగాలను నిర్వహించారు. న్యూటన్ అద్భుతమైన రచయిత కూడా. అనేక శాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశారు. 84 ఏళ్ల వయసులో 1727లో మార్చి 20న మరణించారు.