May 03,2023 08:47

దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నోటి పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. దంతాల మీద ఏర్పడే గారను కాలిక్యులస్‌ అని పిలుస్తారు. పసుపు- గోధుమ రంగు పదార్థం ప్లేక్‌ లాగా పేరుకుపోయి గట్టిపడినప్పుడు దంతాల మీద గార ఏర్పడుతుంది. దీనివల్ల చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి దుర్వాసన వంటి అనేక సమస్యలు వస్తాయి. గారను తొలగించడానికి ప్రొఫెషనల్‌ క్లీనింగ్‌ ఉత్తమ మార్గం. అయితే, గార ఏర్పడకుండా నిరోధించడంలో కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

బేకింగ్‌ సోడా : బేకింగ్‌ సోడా యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంది. ఇది నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను తగినంత నీటితో కలిపి పేస్ట్‌ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను టూత్‌ బ్రష్‌కు అప్లై చేసి రెండు నిమిషాల పాటు పళ్ళు తోముకోవాలి. ఆ తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తుంటే పంటి గార పోతుంది.

కొబ్బరి నూనె పుల్లింగ్‌ : ఒక టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని 15-20 నిమిషాలు పుక్కిలించాలి. ఆ తర్వాత నూనెను ఉమ్మివేసి, నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే గార సమస్య ఉండదు.

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ : హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఒక సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌. రెండు సమాన భాగాలుగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నీరు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నోటిలో ఒక నిమిషం పాటు స్విష్‌ చేయాలి. ఆపై దానిని ఉమ్మివేసి, నోటిని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయాలి.

ఉప్పునీటితో : గారను తగ్గించడానికి ఉప్పునీళ్లు సులభమైన మార్గం. ఇది నోటి నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి, చిగుళ్ళను సంరక్షించడానికి బాగా సహాయపడుతుంది. ఒక కప్పు వెచ్చని నీటిలో అర టీస్పూన్‌ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు పుక్కిలించాలి. ఆపై దానిని ఉమ్మివేసి, నోటిని శుభ్రం చేసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే గార ఏర్పడదు.