Nov 09,2023 22:01

- ఫైబర్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
- దీపావళి తరువాతే స్కిల్‌ కేసుపై తీర్పు : సుప్రీం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఫైబర్‌ నెట్‌ కేసులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ కేసులోనూ 17ఎ ఉన్నందున స్కిల్‌ డెవలప్‌మెంటు కేసు తీర్పు వచ్చిన తరువాతే, ఈ కేసు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. కేసు ముగిసేవరకు అరెస్టు చేయొద్దన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా, గత హామీ మేరకు ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌ కుమార్‌ తెలిపారు. ఈ కేసు విచారణ నవంబరు 30న చేపడతామని, అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఎపి స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై దీపావళి పండగ తరువాత తీర్పును వెల్లడిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ నెల 11 నుంచి 19 వరకు దీపావళి సెలవులు కాగా, 20న సుప్రీంకోర్టు పున:ప్రారంభం కానుంది.