Jun 29,2023 07:15

పిల్లలు ఎక్కువగా తన చుట్టూ ఉన్న తోటి పిల్లలతో పోల్చుకుని చూసుకుంటారు. వారి ఏమైనా ఖరీదైనా వస్తువు కొనుక్కున్నా, ఏదైనా తిన్నా... తాము తినలేకపోతున్నామని ఫీల్‌అవుతుంటారు. తమకు అలాంటి ఉంటే బాగుండు అని, తమ జీవితం అలాగ ఎందుకు లేదని ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో తాము అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తూ...అబద్ధాలు చెబుతుంటారు. ఇది అలవాటుగా మారితే పెద్ద అయ్యేకొద్ది ప్రమాదమవుతుంది. అందుకే మొదట్లోనే గుర్తించి పిల్లల్లో ఈ ఆలోచనను తగ్గించాలి.

  • పిల్లలకు గ్రహింపు శక్తి వేగంగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని చెప్పాలంటే సున్నితంగా చెబుతూ, పెద్దలు కూడా ఆ విషయంలో ఆచరణలో పెట్టాలి. లేకపోతే వెంటనే వారు ప్రశ్నిస్తారు. అబద్ధాలు ఆడినప్పుడు తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు.
  • పిల్లలు కావాలని అబద్ధాలు చెప్పరు. వాళ్ల అబద్ధాల వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే ముందుగా పిల్లలు ఏయే సందర్భాల్లో అబద్ధాలు చెప్తున్నారో గమనించాలి. హోంవర్క్‌ చేయకుండానే చేశాను అని చెప్తుంటే వాళ్లకు హౌమ్‌వర్క్‌ చేయడం ఇష్టం లేదని అర్థం. అలాంటప్పుడు హౌంవర్క్‌ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలి. కష్టంగా అనిపిస్తున్న సబ్జెక్టులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టేలా పేరెంట్స్‌ సపోర్ట్‌ చేయాలి.
  • పిల్లల్లో ఉండే ఆత్మన్యూనత కూడా వాళ్లతో అబద్ధాలు ఆడిస్తుంది. అందుకే తరచుగా అబద్ధాలు ఆడేపిల్లలకు ఏవైనా ఇబ్బందులు, భయాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. వాళ్లతో సున్నితంగా మాట్లాడి, వాళ్లకున్న భయాలు, ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే పిల్లలకు అబద్ధాలు ఆడే అవసరం రాదు.
  • కొందరు పేరెంట్స్‌ పిల్లలతో కఠినంగా ఉంటారు. అలాంటప్పుడు వారి తప్పించుకునేందుకు పిల్లలు అబద్ధాలు ఆడుతుంటారు. అలా భయంతో అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఆ భయం పోగొట్టే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ప్రేమగా, సున్నితంగా మాట్లాడడాన్ని పేరెంట్స్‌ అలవాటు చేసుకోవాలి.
  • తాము చెప్పేది వినాలన్న కోరికతో కూడా చాలామంది పిల్లలు కట్టుకథలు చెప్తుంటారు. ఇలాంటి పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాలి. అలాచేస్తే వాళ్లకున్న తాపత్రయాన్ని తగ్గించొచ్చు. వాళ్లు ఏది చెప్పినా ఓపికగా వింటుండాలి. ఇలా చేయడం ద్వారా వాళ్లకు అబద్ధాలు ఆడే అవసరం తగ్గుతుంది.
  • ఈ జాగ్రత్తలన్నింటితో పాటు పిల్లలకు అబద్ధాలు ఆడడం వల్ల జరిగే నష్టాలను కథల రూపంలో అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి సందర్భంలోనైనా నిజం చెప్పేవాళ్లే నిజమైన హీరోస్‌ అని వివరించాలి.