
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు గణపవరం మండల కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో వీఆర్‌ఏల మండల కమిటీ అధ్యక్షులు ఎరి చెర్ల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ 2017లో వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి పనిచేస్తున్న వీఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం గాక వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియార్టీగా ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని నామినీలు భర్తీ చేయాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 25న జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో వీఆర్‌ఏలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం పట్టాభి, కార్యదర్శి పిల్లి శ్రీనివాసు, రేవాటి నరసయ్య, మోతే వెంకటలక్ష్మి, గడ్డం తులసి పాల్గొన్నారు.