Sep 09,2023 22:20

యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో మెద్వదెవ్‌తో డీ
సెమీస్‌లో టాప్‌సీడ్‌ అల్కరాజ్‌ ఓటమి
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి 2వ సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌, 3వ సీడ్‌, రష్యాకు చెందిన డానియెల్‌ మెద్వదెవ్‌ ప్రవేశించారు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, టాప్‌సీడ్‌ అల్కరాజ్‌ జోరుకు మెద్వదెవ్‌ చెక్‌ పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో మెద్వదెవ్‌ 7-6(7-3), 6-1, 3-6, 6-3తో అల్కరాజ్‌ను ఓడించాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో చేజిక్కించుకున్న మెద్వదెవ్‌.. రెండో సెట్‌ను సునాయాసంగా నెగ్గాడు. మూడో సెట్‌ను కోల్పోయినా.. నాల్గోసెట్‌లో తిరిగి పుంజుకొని మ్యాచ్‌ను ముగించాడు. 2021లో మెద్వదెవ్‌, 2022లో అల్కరాజ్‌ యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను సాధించారు.
రికార్డు గ్రాండ్‌స్లామ్‌కు చేరువలో జకోవిచ్‌..
సెర్బియాకు చెందిన 2వ సీడ్‌, నొవాక్‌ జకోవిచ్‌ రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన రెండో సెమీస్‌లో జకోవిచ్‌ 6-3, 6-2, 7-6(7-4)తో అన్‌సీడెడ్‌, అమెరికాకు చెందిన షెల్టన్‌ను ఓడించాడు. దీంతో కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు చేరువయ్యాడు. అత్యధిక పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను నెగ్గిన ఆటగాళ్ల జాబితాలో జకోవిచ్‌(23) ఇప్పటికే అగ్రస్థానంలో ఉండగా.. మరో టైటిల్‌ నెగ్గితో మార్గరేట్‌ కోర్ట్‌(24గ్రాండ్‌స్లామ్స్‌) రికార్డును సమం చేయనున్నాడు. ఆ తర్వాత రఫెల్‌ నాదల్‌(22), రోజర్‌ ఫెదరర్‌(20) 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో టైటిల్‌కై మెద్వదెవ్‌తో తలపడనున్నాడు.