Mar 23,2023 15:49

ప్రజాశక్తి-రేపల్లె (గుంటూరు) : సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజలకు సచివాలయ సిబ్బంది సహనంతో కూడిన సేవలను అందించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి విలియమ్స్‌ చెప్పారు. మండలంలోని కైతేపల్లి గ్రామ పంచాయతీలోని ఎంపీపీ,యుపిఎస్‌ పాఠశాలలు, సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రంను ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సచివాలయం పరిధిలో పరిష్కారం పొందని సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కారాలకు మార్గాలు చూపాలన్నారు. ప్రతి రోజు జరిగే స్పందన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. సచివాలయాలలో నిర్వహించే పనుల వివరాలను రికార్డులలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. రికార్డులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల నిర్వహణ సజావుగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించినా, అవకతవకలకు పాల్పడినా సహించేదిలేదని చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల వివరాలను తమ పరిధిలోని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది ఉందని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్ధులతో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ విజయేంద్ర, సచివాలయ, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.