ఇస్లామాబాద్ : ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని అధ్యక్షులు అరిఫ్ అల్వి గురువారం లాంఛనంగా రద్దు చేశారు. ఈ ఏడాది చివరిలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఆపద్ధర్మ ప్రధానిని నియమించే విషయమై ప్రతిపక్ష నేతతో ప్రధాని ఆ తర్వాత చర్చలు జరిపారు. ఆపద్ధర్మ ప్రధాని నియామకం జరిగేవరకు షరీఫ్ తన విధులను నిర్వర్తిస్తారు. పాక్ రాజ్యాంగంలోని 58వ అధికరణ కింద నేషనల్ అసెంబ్లీని బుధవారం అర్ధరాత్రి రద్దు చేసినట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటన జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆపద్ధర్మ ప్రధాని పేరును ఖరారు చేయడానికి మూడు రోజుల గడువుంది. అయితే ప్రధాని, ప్రతిపక్ష నేత ఒక పేరును ఆమోదించడంలో విఫలమైన పక్షంలో ఈ విషయం పార్లమెంట్ స్పీకర్ ఏర్పాటు చేసిన కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ మూడు రోజుల్లోగా తాత్కాలిక ప్రధానిని నియమించాల్సి వుంది. ఒకవేళ ఆ కమిటీ కూడా విఫలమైతే పాక్ ఎన్నికల కమిషన్ రెండు రోజుల్లో తాత్కాలిక ప్రధానిని ఎంపిక చేస్తుంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పేర్ల నుండి ఆ వ్యక్తిని ఎంపిక చేస్తారు.