
పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కష్టంగా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా శక్తికి మించి చదివిస్తారు. 'ఒత్తిడి పెట్టుకోవద్దు' అంటూనే మంచి ర్యాంకు తెచ్చుకోవాలని చాలామంది తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ప్రస్తుతం కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తల్లిదండ్రులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రతిసారీ ఇలాగే జరుగుతున్నా ఈసారి మాత్రం తెగ కంగారు పడుతున్నారు. రాజస్థాన్ కోటాలో 20 మందికి పైగా విద్యార్థులు ఒత్తిడికి తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం, ప్రముఖ తమిళ నటుడు, విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల బలవన్మరణం చెందడం వంటి సంఘటనలు చాలామందిని కదిలిస్తున్నాయి.
చంద్రయాన్ ప్రయోగం విజయవంతమై చంద్రుని చేరిన మనం విజ్ఞానప్రయాణంలో నక్షత్ర తీరాలను తాకామని తెగ సంబరపడిపోయాం. అయితే మన కలలు, ఆకాంక్షలు ఆవైపు అడుగులు వేయడం ఎప్పుడో ప్రారంభమైపోయింది. ఆ ప్రభావంతోనే ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలే ముందుండాలని, మంచి ర్యాంకులు సాధించాలని బిడ్డలు పుట్టిన దగ్గర నుండి మనకు తెలియకుండానే వాళ్లపై ఒత్తిడి పెంచేస్తున్నాం. 'జెఇఇ, ఐఐటి కోచింగ్ ఇవ్వాలని మేము పాప/ బాబు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నాం' అనే తల్లిదండ్రులను ఎంతో మందిని చూశాను' అంటున్నారు ఢిల్లీలో జెఇఇ, ఐఐటి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఆయిన్ అహ్మద్ సిద్ధిఖీ. '7,8 తరగతులు చదువుతున్నప్పుడే పిల్లలకు ఇక్కడికి పంపించే తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమందైతే 5వ తరగతి నుండి శిక్షణ ఇస్తే కచ్చితంగా తమ పిల్లలు పోటీలో ముందుంటారని చెబుతారు' అని వివరించారాయన. ఊయల నుండే పిల్లలపై చదువు ఒత్తిడి పెట్టడం మధ్యతరగతి జీవితాల్లో సాధారణమని ఆయన చెబుతున్నారు.

ప్రతిషాత్మ్మకంగా ప్రవేశ పరీక్షలు
ఇంజినీరింగ్, వైద్య విద్య, సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థాయి అందుకోవాలంటే జెఇఇ, నీట్, ఐఐటి కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఈ ప్రవేశపరీక్షలు విద్యార్థుల జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.. ప్రభావవంతమైనవి. అందుకే ప్రతి ఏటా రాజస్థాన్ కోటాలో ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటోంది. ఇంకా అనేక వేల మంది తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా తరలి వెళుతున్నారు.
ఒత్తిడి సర్వసాధారణం
కోటాలో సంభవిస్తున్న మరణాలు కొత్తవి కాదు. ఈ పరిణామం తీవ్ర రుగ్మతలో ఉన్న విద్యావ్యవస్థకు ప్రతిబింబం. కోచింగ్ సెంటర్లు కర్మాగారాల్లా పనిచేయడం ప్రారంభించిన నాటి నుండే ఇది మొదలైంది. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం, నిద్రలేమి సమస్యలు, ఆందోళన సర్వసాధారణంగా ఉన్నాయని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడో ఒకప్పుడు ప్రెషర్ కుక్కర్ పేలినట్లు చెల్లాచెదురైపోతాయి.

పదేళ్లలో 70 శాతం పెరిగిన మరణాలు
జాతీయ నేర గణాంకాల నివేదిక(ఎన్‌సిఆర్‌బి) ప్రకారం 2021లో జరిగిన ఆత్మహత్యల్లో 8 శాతం అంటే 13 వేలకు పైగా మరణాల్లో విద్యార్థులే ఉన్నారు. 'పరీక్షల్లో వైఫల్యమే' కారణమని నివేదికలో తేలింది. దశాబ్దంనాటి గణాంకాలతో పోల్చినప్పుడు 2011లో ఈ మరణాలు 7 వేలకు పైచిలుకు ఉన్నాయి. అంటే పదేళ్లల్లో విద్యార్థుల ఆత్మహత్యలు 70 శాతం పెరిగాయి. 2023లో జెఇఇ కోసం సిద్ధమైన 1.95 లక్షల మంది విద్యార్థుల్లో 22 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. దీన్నిబట్టే పోటీ తీవ్రత, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఐఐటి మద్రాస్‌లో వెల్‌నెస్ సెంటర్, నలుగురు క్లినికల్ సైకాలజిస్టులు, ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్టు ఉన్నప్పటికీ ఈ ఏడాది నలుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 'తమ శక్తి సామర్థ్యాలు, ఏ రంగంలో నైపుణ్యత సాధించగలమన్న స్వీయ స్పృహ ప్రతి విద్యార్థి కలిగి ఉండాలి. శిక్షణ తీసుకుని ర్యాంకు వచ్చాక కూడా చదువు కొనసాగించడంలో ఒత్తిడి కొనసాగుతుంది. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఆత్మహత్యలు చూడబోతాం' అని హెచ్చరిస్తున్నారు కేరళ షిప్పింగ్ ఇన్‌లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ ఎండి ప్రశాంత్ నాయర్.
శ్రామిక జనాభాలో 6 శాతమే!
మన దేశ శ్రామిక జనాభాలో 6 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో జనాభా పెరుగుదల కారణంగా ప్రస్తుతం ప్రతి సంవత్సరం 24 మిలియన్లు అంటే రెండు కోట్లా 40 లక్షల మంది ఉద్యోగార్ధులు సిద్ధమవుతున్నారు. అయితే ఐదు లక్షల మందికి మాత్రమే కొంత ఆర్థిక భద్రత ఇచ్చే వ్యవస్థీకృత రంగ ఉద్యోగాలు లభిస్తున్నాయి' అని ఆర్థికవేత్త, విశ్రాంత ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అంటున్నారు.
కోచింగ్ సెంటర్లలో పడుతున్న ఒత్తిడి కంటే తల్లిదండ్రుల నుండే అధిక ఒత్తిడి ఉంటుందని కేరళ కొచ్చి కేంద్రంగా నడిచే కోచింగ్ సెంటర్ విద్యార్థులు అంటున్నారు. ' తల్లిదండ్రుల ఒత్తిడితోనే ప్రొఫెషన్ కోర్సులకు అత్యధిక మంది విద్యార్థులు వస్తున్నారు' అంటున్నారు కొచ్చికి చెందిన విశ్లేషకులు జయరామ్. 'సమాజంలో గౌరవం పొందాలంటే చదువు, ఉద్యోగం తప్పనిసరి అని భావించే మధ్య తరగతి కుటుంబాల నుండే కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు బారులు తీరుతున్నారు' అని ఆవేదన చెందుతున్నారు జయరామ్.
తల్లిదండ్రుల ఆశలు, కలలే కోచింగ్ సెంటర్ల ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయాయి. పిల్లలను బలి పశువులను చేస్తున్న తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్లు, ఇన్‌స్టిట్యూట్లు తమ ధోరణులను మార్చుకోనంత కాలం, చదువు పిల్లలకు, పెద్దలకు గుదిబండగానే ఉంటుంది. విజ్ఞానం స్థానంలో ఒత్తిడి చేరుతుంది. పిల్లల భవిష్యత్తు ఆశలను చిదిమేసే మరణశాసనాలు మళ్లీ మళ్లీ రాకుండా ప్రతి ఒక్కరూ మేల్కొనాలి.
పిల్లలపై ఒత్తిడికి అనేక కారణాలు
పిల్లలందరికీ పోటీపరీక్షలకు సిద్ధమయ్యే సామర్థ్యం ఉండదు. కేవలం తల్లిదండ్రుల ఇష్టానుసారం పరీక్షల్లో కూర్చొనే పిల్లలు చాలామంది. అందుకే పిల్లల శక్తి, సామర్థ్యాలను తల్లిదండ్రులే అంచనా వేయాలి. అప్పుడే వారిపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ 'నీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నీకు ర్యాంకు రాకపోతే పరువు పోతుంది. నీ తోటి పిల్లలను చూసి నేర్చుకో' అని తల్లిదండ్రులు పిల్లలపై పదే పదే ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఏ పోటీ పరీక్షలోనైనా, చదివిన చదువుకు సరితూగే ప్రశ్నలు ఉండడం లేదు. అంతకుమించి ఉంటుంది. దీంతో ఇంటర్ తరువాత పోటీ పరీక్షలకు హాజరయ్యే పిల్లలు అదనంగా మరో కోర్సు నేర్చుకోవాల్సివస్తోంది. ఇక ఇన్‌స్టిట్యూట్లలో మార్కుల ఆధారంగా పిల్లల గ్రేడ్‌లు మార్చేస్తుంటారు. ఈ ప్రభావం వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈమధ్య ఒత్తిడితో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు మోటివేషన్ తరగతులకు పంపుతున్నారు. అది పిల్లల ఒత్తిడిని మరింత పెంచుతుంది. టీనేజ్ పిల్లల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల హెచ్చు తగ్గులు, శరీరంలో మార్పులు, కొత్త కొత్త ఆలోచనలతో నిరంతరం వారు సతమతమవుతూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిసిందో వారిని తల్లిదండ్రులు సైకాలిజకల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. స్వయంగా విద్యార్థులే తాము ఒత్తిడికి గురవుతున్నామని గమనించినా కౌన్సిలింగ్‌కు హాజరవ్వాలి. స్నేహితులు కూడా తమ ఫ్రెండ్స్ ఒత్తిడిని తగ్గించేలా కౌన్సిలింగ్‌ను సూచించాలి. సమాజంలో ఈరకమైన మార్పు వచ్చినప్పుడు పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా బలవన్మరణాలు నివారించబడతాయి.
- పి.విశేష్, సైకాలజిస్ట్,
8019 000066