అమెరికా: అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్- హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా విదేశీ మదుపర్లు ఈ నెలలో భారత ఈక్విటీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు రూ.9,800 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. సెప్టెంబరులో అయితే ఏకంగా రూ.14,767 కోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఈక్విటీలోకి విదేశీ మదుపర్ల ద్వారా నికరంగా రూ. 1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఇండియన్ ఈక్విటీల్లో విదేశీ మదుపర్లు రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి.
మరోవైపు, ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది డెట్ మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐల ద్వారా వచ్చే పెట్టుబడులు రూ.33 వేల కోట్లకు చేరాయి. రంగాలవారీగా చూస్తే.. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. మూలధన వస్తువులు, ఆటోమొబైల్స్ రంగాల్లో మాత్రం కొనుగోళ్లను కొనసాగించారు.
-