Oct 10,2023 15:58

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) :దళితుల పట్ల వివక్షత మానుకోవాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు దూళి జయరాజు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ దళితుల దహన సంస్కారాలకు పాలకులు, ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు చొరవ చూపకపోవడం దళితుల పట్ల వారికి ఉన్న వివక్షత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ పేదవర్గాల గురించి ఆశించిన కల నెరవేరిందన్నారు. బానిసత్వం నుంచి ప్రశ్నించేందుకు మొట్టమొదటిసారిగా వినూత్నంగా మండలంలోని అర్తమూరు దళితులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దళితులకు శ్మశానవాటిక తదితర సౌకర్యాల కల్పన కోసం ఎమ్మార్పీఎస్‌ మద్దతు ఇవ్వడంతో పాటు వారి పోరాటంలో భాగస్వామ్యం తీసుకుందన్నారు. ఇది ఒక్క అర్తమూరు సమస్య కాదని నియోజకవర్గంలో ఏఏ గ్రామాల్లో ఇటువంటి సమస్యలున్నాయో సేకరించి దళితులందరితో ఐక్యకార్యచరణ రూపొందించి పోరాటాన్ని ముందుకు తీసుకు వెళతామన్నారు.