Jun 25,2023 07:29

చాయ్ తో మొదలైన ప్రభుత్వం ఆవు దగ్గర ఆగిపొయ్యింది
వికాసమనే తల్లి దారి తప్పి, ఎక్కడో ఆగమయ్యింది
అమ్మాయిలు భావోద్వేగాలు తింటున్నారు
అబ్బాయిలు మోసపు కలలు తింటున్నారు
ఉద్యోగులు లంచం తింటున్నారు
నేతలు కరెన్సీ తింటున్నారు
రైతులు విషం తింటున్నారు
ఉద్యమకారులు బుల్లెట్లు తింటున్నారు..
అందరూ ఏదో ఒకటి సుష్టుగా తింటూనే ఉన్నారు.
ఎవరంటారు భారత్‌ ఆకలితో అలమటిస్తోందని?
చారువాలా ప్రధానమంత్రయ్యాడు
పన్నెండు చదివినమ్మ విద్యామంత్రయ్యింది
గోచీ సన్నాసులంతా మంత్రులయ్యారు
వేలి ముద్రగాళ్ళు ఎమ్మెల్యేలయ్యారు
డిగ్రీలు, పిజీలు చేసిన వారు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల్లో ఇరుక్కున్నారు
ఒంటరిగా ఉన్నవాడు వ్యవస్థల్ని ముక్కలు చేస్తున్నాడు
వివాహితుడు మార్కెట్‌ నుంచి కూరలు మోస్తున్నాడు
వినేవాళ్ళకే కదా ఎవరైనా చెవుల్లో పూలు పెడతారు?
తెలివిగల జపానువాళ్ళు బుల్లెట్‌ ట్రైన్‌ నడుపుతారు
ఇండియా మేధావులు పదకొండు మందికి ఓం నమశ్శివాయ పంపుతారు
దాంతో ఫ్రీ బాలెన్స్‌ చమత్కారం జరుగుతుందని ఆశపడతారు
పంపకపోతే నిజంగానే విపత్తేదో సంభవిస్తుందని ఝడుస్తారు
అగర్‌బత్తులు రెండు రకాలుగా ఉంటాయి
ఒకటి భగవంతుడికి మరొకటి దోమలకు
భగవంతుడు వచ్చేది లేదు. దోమలు పోయేది లేదు
ఉన్నవి ఖాళీ కడుపులు, యోగా చెయ్యమంటారు
జేబులో చిల్లిగవ్వ ఉండదు, బ్యాంక్‌ ఎకౌంట్‌ తెరవమంటారు
ఉండడానికి ఇల్లు లేదురా నాయనా అంటే
మరగుదొడ్లు కట్టిస్తామంటారు
ఊళ్ళో కరెంటు ఉండదు, డిజిటల్‌ ఇండియా అయిపోయిందంటారు
దొరికేవన్నీ విదేశీ కంపెనీల వస్తువులు
దాన్నే 'మేకిన్‌ ఇండియా' అనమంటారు
పప్పు, ఉప్పు, బియ్యం జనం కొనలేకపోతున్నారు
టాటా కార్లేమో అగ్గువైపోయాయంటున్నారు
మెదడ్లో జాతి మతాల ద్వేషం నింపుతారు
స్వచ్ఛ భారత్‌ అభియాన్‌-గూర్చి గొప్పగా చెవుతారు
అసమాన్యుడి 'మన్‌ కి బాత్‌'లో.. ఏదీ వినిపించలేదు
సామాన్యుడి దిల్‌ కీ బాత్‌ ?
 

- డా|| దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త