రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులకు కూడా మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. విభజన హామీలతోపాటు, నిత్య పథకాల అమలుకు సంబంధించిన నిధులు కూడా కేంద్రం సక్రమంగా ఇవ్వడం లేదు. అనేక రంగాలకు రావాల్సిన నిధులకు భారీగా కోతలు పడుతున్నాయి. రుణాలు తెచ్చుకోవడానికి కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంలేదు. దీంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోంది. అదే సమయంలో రాష్ట్రానికి ఎంతో చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. ఏమి చేశారో వివరాలు చెప్పండంటే మాత్రం జవాబు ఇవ్వడం లేదు.
కీలకమైన రెవెన్యూ లోటు అంశం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014-15లో రాష్ట్ర లోటు రూ. 16వేల కోట్లుగా ఉన్నట్లు కాగ్ తేల్చింది. ఈ వివరాలను రాష్ట్ర అధికారులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, వీటిని మోడీ సర్కారు పట్టించుకోలేదు. అలాగే తొలి ఐదేళ్ల కాలానికి సంబంధించి కూడా లోటు వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులు కేంద్రానికి సమర్పించారు. ప్రధానమంత్రి ఇటీవల భీమవరం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందిస్తూ రూ. 34 వేల కోట్ల వరకు లోటు నిధులు విడుదల చేయాలని కోరారు. మరోసారి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరిస్తూ ఆ నిధులను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే ఈ లెక్కలను కేంద్రం తోసిబుచ్చుతూ లోటు కేవలం రూ. 6,609 కోట్లు మాత్రమేనని తెలిపింది. అదేమిటని అడిగితే లెక్కలు నిర్ధారించేది కేంద్రం కాదని బుకాయించింది.
రుణాలు రాకుండా
కేంద్రం నుంచి నిధులు తగ్గిపోగా, కనీసం అప్పులు తెచ్చుకునైనా బండి నడిపిద్దామనుకుంటున్న రాష్ట్రానికి కేంద్రం రిజర్వ్‌బ్యాంకు రూపంలో అడ్డు కట్ట వేస్తోంది. రూ.48 వేల కోట్ల వరకు రుణాలు తీసుకునేందుకు ముందుగా అనుమతి ఇచ్చిన కేంద్రం, తరువాత అంతకు ముందు సంవత్సరాల్లో పరిమితికి మించి అప్పు చేశారన్న కారణాన్ని చూపిస్తూ రూ.17 వేల కోట్లకుపైగా కొత్త పరిమితిలో కోతలు విధించడం గమనార్హం. ఇదే సమయంలో ప్రభుత్వ గ్యారంటీలతో ఇచ్చిన రుణాలను కూడా మొత్తం రుణ పరిమితిలో చూపించడం వల్ల తొలి త్రైమాసికంలోనే రుణ పరిమితిని దాటిపోయినట్టయింది. మరో అరశాతం రుణంకోసం విద్యుత్, వ్యవసాయరంగాల్లో సంస్కరణలు అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది.
పన్నుల్లో వాటాపై కిరికిరి
కేంద్ర పన్నుల్లో రాష్ట్రా వాటా నిధులకు సంబంధించి కూడా అన్యాయమే జరుగుతోంది. మొత్తం పన్నుల్లో 42 శాతం నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉండగా గడిచిన ఆరు సంవత్సరాల్లో 37 శాతం నిధులనే పంపిణీ చేసింది. దీనిలో రాష్ట్రానికి వచ్చింది నామమాత్రమే ! అదే సమయంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను రద్దు చేసింది. పన్నుల వాటా నిధులను సక్రమంగా విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినా ఫలితం కనిపించడంలేదు.
ఏడు జిల్లాల కంటతడి
రాష్ట్ర విభజన సమయంలో ఏడు వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం చేస్తామని చెప్పిన కేంద్రం మూడేళ్లకే చేతులెత్తేసింది. ఒక్కో జిల్లాకు ఏటా 50 కోట్లు చొప్పున ఇవ్వాల్సి ఉండగా, మొత్తం రూ.1,050 కోట్లు ఇచ్చిన తరువాత దాని ఊసే విస్మరించింది. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత తమదేనని చెప్పుకున్న కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. తరువాత కాలంలో వందల కొద్దీ వినతులు సమర్పించుకున్నా కూడా కేంద్ర పెద్దలు పట్టించుకోవడమే మానేసారు. రాష్ట్ర పథకాలకు కేంద్రం అందించే నిధుల్లో కూడా కోతలు పెరుగుతున్నట్లు ఆర్ధికశాఖ చెబుతోంది. మోడల్ స్కూల్స్, పోలీస్ మోడర్నైజేషన్ స్కీమ్, మెగా ఫుడ్ ప్రాసెసిరగ్ యూనిట్లు, ఇతర నీటిపారుదల, రహదారుల నిర్మాణం వంటి పథకాలకు నిధులు తగ్గినట్లు ఆర్ధికశాఖ చెబుతోంది.
పటౌడి










