
అతిసార లేదా డయేరియా మామూలుగా వైరస్ వల్ల వస్తోంది. కొన్ని రకాలైన బ్యాక్టీరియా, ప్రోటోజోవాల ద్వారా కూడా అతిసార రావొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా విరేచనాలు చేసుకుంటే దానిని అతిసారగా భావించొచ్చు. ఐదేళ్ల లోపు పిల్లల్లో జరిగే మరణాలకు అతిసార వ్యాధి రెండో ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా దాదాపు 170 కోట్ల అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం. డయేరియా అతి భయంకరమైన వ్యాధి కాకపోయినా దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. చిన్న జాగ్రత్తలతో కూడా డయేరియాను నివారించుకోవచ్చు. కొద్దిపాటి ప్రాథమిక వైద్యంతో కూడా ప్రాణహాని జరగకుండా కాపాడుకోవొచ్చు.
వర్షాలు కురుస్తున్నప్పుడు పైప్ లైన్లు పగలడం, బహిరంగ మలవిసర్జన కారణంగా కలుషితమైన నీరు నీటి పైపుల ద్వారా నీటి ట్యాంకుల్లో చేరిన ఈ కలుషిత నీరు తాగడం డయేరియా సోకడానికి ః కారణం అవుతుంది. వ్యక్తిగత శుభ్రత లేని కారణంగా తాగేనీళ్ళతో పాటు తినే ఆహారం కూడా కలుషితమై డయేరియా తీవ్రంగా సోకుతుంది. సరైన వైద్యాన్ని సరైన సమయంలో అందిస్తే డయేరియా తీవ్రతను సులభంగా తగ్గించొచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలతో డయేరియా రాకుండా చూసుకోవచ్చు.
లక్షణాలు ఇలా ...
డయేరియా సోకినప్పుడు నీళ్ళ విరేచనాలతో పాటు వాంతులు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో జ్వరం, పొట్టలో నొప్పి కూడా రావచ్చు. విరేచనాలతో శరీరంలోని నీళ్ళతో పాటు శరీరానికి ముఖ్యమైన సోడియం, పొటాషియం లాంటి లవణాలు శరీరం నుంచి వెలుపలికి పోతాయి. శరీరంలో నీటి శాతం తగ్గిన కారణంగా దాహం ఎక్కువగా కావడం, నీరసంగా ఉండడం, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బిపి తగ్గిపోతుంది. మూత్రపిండాలకు సరిపోయినంత రక్తం అందక చెడిపోయే అవకాశం ఏర్పడుతుంది. పిల్లలు, వృద్ధుల్లో డయేరియా సమస్య ఎక్కువైతే కోలుకోవడం కష్టం.. అందుకే లక్షణాలు ఎక్కువైనప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. రక్తంలో లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్ష చేసి నీటి లేమి పరిస్థితిని పరిశీలించి వైద్యం చేస్తారు.

ఎప్పుడు ప్రమాదమంటే..
కొద్దిపాటి విరేచనాలకు ప్రమాదం ఏమి జరగదు. విరేచనాలు ఎక్కువగా అయ్యి శరీరంలోని నీటి శాతం ఎక్కువగా తగ్గి, బిపి తగ్గిపోయి శరీర భాగాలకు ప్రధానంగా మూత్రపిండాలు, మెదడుకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ప్రాణహాని జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాన లవణాలైన సోడియం, పొటాషియం తగ్గిపోయి తీవ్రమైన బలహీనతకు గురై అపస్మారక స్థితిలోకి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. మూత్రం తక్కువ మోతాదులో రావడం లేదా అసలు రాకపోవడం, విపరీతంగా దప్పిక కావడం, బీపీ తీవ్రంగా తగ్గిపోవడం, అపస్మారక స్థితిలోకి చేరుకోవడం, కనుగుడ్లు లోపలికి పీక్కుపోవడం, చర్మం ముడతలు పడడం వంటి పరిస్థితులను ప్రమాద ఘంటికలుగా గుర్తించాలి.
ప్రాథమిక వైద్యంతో రక్షణ
ప్రమాదస్థితికి చేరుకోక ముందే విరేచనాలతో శరీరం కోల్పోయిన నీరు, లవణాలను సరి చేసుకోవడంతో ఈ ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం కొబ్బరినీళ్ళు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మకాయ నీళ్ళు, పండ్ల రసం, ఉప్పు కలిపిన గంజి లాంటి పానీయాలను తీసుకోవడం మంచిది. ఈ పానీయాలను తెచ్చుకోవడం, కలుపుకోవడం సాధ్యపడనప్పుడు అన్నివేళలా, అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్)ను తెచ్చుకొని తరచుగా తాగొచ్చు. ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాంతులయ్యే అవకాశం ఉంటుంది. కొద్ది కొద్దిగా ఎక్కువ పర్యాయాలు తీసుకోవడం మంచిది. వాంతులవుతన్నపుడు ఈ పానీయాలను తీసుకోవడం సాధ్యం కాకపోతే సెలైన్ ఎక్కించుకోవడం అవసరం. అవసరమైతే నోటి ద్వారా ఈ పానీయాలను తీసుకుంటూ నరం ద్వారా సెలైన్ ఎక్కించుకోవాలి. నోటి ద్వారా తీసు కుంటున్న పానీయాలు, నరం ద్వారా ఎక్కించుకున్న సెలైన్ మోతాదు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి మూడు కొలమానాలను దృష్టిలో ఉంచుకోవాలి. దప్పిక, మూత్రం మోతాదు, బిపి వంటివి రెగ్యులర్ పద్ధతుల్లో ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు.

పిల్లల విషయంలో జాగ్రత్త
ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా సోకితే ఒక్కోసారి డీహైడ్రేషన్ ఎక్కువై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. డయేరియా సోకితే సొంత వైద్యానికి బదులు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డీహైడ్రేషన్ ఎక్కువైతే డాక్టర్లు ఐవీ లైన్ ద్వారా సెలైన్ ఎక్కిస్తారు. అలాగే అవసరాన్ని బట్టి జింక్, విటమిన్-ఎ సప్లిమెంట్స్ అందిస్తారు. దీనివల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తపడొచ్చు. పిల్లలో అతిసార వ్యాధికి ప్రధాన కారణం రోటా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ క్రిమి నివారణకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేయించడం ద్వారా డయేరియా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. తల్లిపాలు తాగే పిల్లలకు అతిసార వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. రెండేండ్లు వచ్చే వరకూ పిల్లలకు తల్లిపాలు ఇస్తూ ఉంటే వాళ్లలో అతిసార వ్యాధిని తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
అతిసార రాకుండా జాగ్రత్తలు..
డయేరియా బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రత పాటించడం ఒక్కటే మార్గం.
- వేడిగా ఉన్నప్పుడే ఆహార పదార్థాలను తినాలి
- భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పక సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
- కాచి చల్లార్చిన నీళ్లు లేదా ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగాలి. వీలైతే ఎల్లప్పుడూ ఇలాంటి నీళ్లనే తాగడం ఆరోగ్యానికి మంచిది.
- చేతి గోళ్లు పెంచుకోవద్దు.
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
- తినే ఆహార పదార్థాలపైన ఈగలు వాలకుండా మూతలు పెట్టాలి.
- ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
- బయటి ఆహారాలను వీలైనంతవరకు తినొద్దు
- బహిర్భూమిలో మలవిసర్జనను నివారించాలి.
- మురిగిపోయిన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
- ఆహార పదార్థాలను తయారు చేసే ముందు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు తప్పక చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- డాక్టర్ ఎం.వి.రమణయ్య
డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల