Sep 17,2023 13:02

యూజీన్‌: భారత స్టార్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్‌ వాద్లెచ్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం నిర్వహించిన ఈ పోటీల్లో నీరజ్‌ జావెలిన్‌ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మొదటి, నాలుగు ప్రయత్నాల్లో విఫలమైన నీరజ్‌ రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జాకబ్‌ వాద్లెచ్‌ తన చివరి ప్రయత్నంలో 84.24 మీటర్ల అత్యుత్తమ త్రో విసిరి ఛాంపియన్‌గా నిలిచాడు. ఫిన్లాండ్‌కు చెందిన ఆలివర్‌ హెలాండర్‌ 80.90 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు.