Sep 08,2023 22:11

సూపర్‌ -4లో ఆ ఒక్క మ్యాచ్‌కేనంటూ ఎసిసి ప్రకటన
ముంబయి: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య 10న జరగాల్సిన సూపర్‌4 మ్యాచ్‌కు రిజర్వు డేను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఏసిసి గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో సూపర్‌4 మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించలేదు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న మిగిలిన సూపర్‌4 మ్యాచ్‌లకూ రిజర్వు డేను కేటాయించలేదు. కేవలం భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగే ఒక్క మ్యాచ్‌కే మాత్రమే కేటాయించడంపై క్రీడాభిమానులు పెదవి విరుస్తున్నారు. ఏసిసి కాసుల రాబట్టడం కోసమే ఈ కీలక నిర్ణయం వారు అంటున్నారు. దీంతో కొలంబో వేదికగా 10న(ఆదివారం) భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఒకవేళ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే ఆ మ్యాచ్‌ 11న(సోమవారం) జరగనుంది. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు పసికూన నేపాల్‌పై మాత్రమే గెలిచి సూపర్‌-4 చేరిన విషయం తెలిసిందే.
భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్ష ముప్పు
సూపర్‌-4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న కొలంబో నగరంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఆలస్యంతో రెండు వారాలుగా అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. 75 శాతం వాన పడే అవకాశం ఉందని, మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోన్నకర్లేదని, మధ్యాహ్న సమయంలో 99 శాతం వర్షం పడే ఛాన్స్‌ ఉందని, 28 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అక్కడి వాతావరణశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో వర్షాల నేపథ్యంలో సూపర్‌-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌తోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సి) ప్రతిపాదించినా.. ఏసిసి ఒప్పుకోలేదు. తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని తరలించడం కష్టమని అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ చెప్పడమే అందుకు కారణమని సమాచారం. ఈ పరిస్థితుల్లోనే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగే సూపర్‌ 4 మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే కేటాయించారు. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌కు ఎలాగూ రిజర్వ్‌ డే ఉంది.