Jun 24,2023 16:26

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 30న విజయవాడ అలంకార సెంటర్‌ వద్ద జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న.శివశంకరరావు పిలుపునిచ్చారు. శనివారం ఎంటిఎంసీ పరిధిలోని గుండిమెడ గ్రామంలో రైతు,కౌలు రైతు నాయకులతో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ.. గత సంవత్సరం అధిక వర్షాల వలన పంటలు దెబ్బతిని రైతన్న పూర్తిగా నష్టపోయారన్నారు. ఒక్క రైతుకి పరిహారం అందలేదని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆదుకుంటామన్న ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడం వలన పంటలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడిందని ఆయన దుయ్యబట్టారు. ఒకవైపున అకాల వర్షాలు, మరోవైపున ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పండిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడం రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారన్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందాన వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టేందుకు, నరేంద్ర మోడీ విధానాలను తూచా తప్పకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా రైతాంగ వ్యతిరేక చట్టాలను రైతులు వ్యతిరేకించినప్పటికీ , రైతులపై భారాలు వేసేందుకే విద్యుత్‌ సంస్కరణలు తీసుకువచ్చి వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి ఆంధ్ర రత్న పంపింగ్‌ స్కీం నుండి ప్రాతూరు గుండె మెడ చిరావూరు తదితర గ్రామాలకు వెళ్లే పంట కాలవ వ్యర్ధాలతో పూడుకు పోయిందన్నారు. దీనివలన రైతులకు సాగునీరుకు బదులు మురుగునీరు పారుతుందని, తక్షణమే పంట కాలువను రిపేరు చేసి, రైతుల పంట పొలాలకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, తదితర డిమాండ్లతో విజయవాడలో జరుగు మహా ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి బత్తుల సంసోను, అణుమోలు పాములు, నాగేశ్వరరావు, శివయ్య, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.